భారీగా పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు!

GST revenue collection for Oct second highest in history - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ. ఈ ఏడాదిలో వరుసగా నాలుగో నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. 

ఈ జీఎస్‌టీ వసూళ్లలో కేంద్ర వాటా రూ.23,861 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ వాటా రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,998 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.699 కోట్లతో సహా). ఈ సమ్మిళిత జీఎస్‌టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉన్నాయి. చిప్ కొరత వల్ల కార్లు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ప్రభావితం కాకపోతే ఇంకా ఆదాయం ఎక్కువగా వచ్చి ఉండేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

(చదవండి: ఇండియన్‌ బ్యాంకులో రూ.266 కోట్ల మోసం!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top