‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఇప్పటికే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’ (2014), వెంకటేశ్ హీరోగా జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘దృశ్యం 2’ (2021) సినిమాలు హిట్‌గా నిలిచాయి.
ఈ ఫ్రాంచైజీలో మలయాళం, హిందీ భాషల్లో ‘దృశ్యం 3’ చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. అయితే తెలుగు లో ‘దృశ్యం 3’ పట్టాలెక్కుతుందా? లేదా అని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాత, హీరో వెంకటేశ్ సోదరుడు సురేష్‌బాబు ఇచ్చిన అప్‌డేట్‌తో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. శోభిత ధూళిపాళ్ల లీడ్ రోల్‌లో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘చీకటిలో..’. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సురేష్‌బాబు ‘దృశ్యం 3’ షూట్‌కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు స్పష్టత ఇచ్చారు. ‘‘దృశ్యం 3’ సినిమాలోనూ వెంకటేశ్ హీరోగా నటిస్తారు. ఈ చిత్రం అక్టోబరులో సెట్స్‌పైకి వెళుతుంది’’ అని చెప్పారు. అయితే దర్శకుడి పేరు మాత్రం చెప్పలేదు ఆయన. ఇదిలా ఉంటే... ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ అనే సినిమాలో నటిస్తున్నారు వెంకటేశ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ షూట్ పూర్తయ్యాక ‘దృశ్యం 3’ చిత్రీకరణలో పాల్గొంటారు వెంకటేశ్.


