హింద్‌ జింక్‌కు సర్కారు గుడ్‌బై

Govt approves sale of entire remaining stake in Hindustan Zinc - Sakshi

వాటా విక్రయానికి సీసీఈఏ లైన్‌ క్లియర్‌

29.5 శాతం ప్రభుత్వ వాటా ఆఫర్‌

రూ. 38,000 కోట్ల సమీకరణకు చాన్స్‌

న్యూఢిల్లీ: మెటల్‌ రంగ దిగ్గజం హిందుస్తాన్‌ జింక్‌ లిమిటెడ్‌(హెచ్‌జెడ్‌ఎల్‌)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. హింద్‌ జింక్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 38,000 కోట్లు సమకూరే అవకాశముంది. బుధవారం సమావేశమైన సీసీఈఏ ఇందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియకు ఊపు లభించనున్నట్లు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లలో వాటాల వ్యూహాత్మక విక్రయం ద్వారా ఈ ఏడాది రూ. 65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్‌లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.  

రూ. 305 ధరలో..: బుధవారం ట్రేడింగ్‌లో హింద్‌ జింక్‌ షేరు బీఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ. 305 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 317ను అధిగమించింది. ప్రభుత్వం 29.5 శాతం వాటాకు సమానమైన దాదాపు 125 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ. 38,000 కోట్లు లభించే వీలుంది. కాగా.. 2002 వరకూ హింద్‌ జింక్‌ ప్రభుత్వ రంగ సంస్థగా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 26 శాతం వాటాను స్టెరిలైట్‌ అపార్చునిటీస్‌ అండ్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు విక్రయించింది.డీల్‌ విలువ రూ. 445 కోట్లుకాగా.. తద్వారా వేదాంతా గ్రూప్‌ యాజమాన్య నియంత్రణను చేపట్టింది. తదుపరి వేదాంతా గ్రూప్‌ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా 20 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2003 నవంబర్‌లో ప్రభుత్వం నుంచి మరో 18.92 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఫలితంగా హెచ్‌జెడ్‌ఎల్‌లో వేదాంతా వాటా 64.92 శాతానికి ఎగసింది. కాగా.. హెచ్‌జెడ్‌ఎల్‌లో అదనంగా 5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఇటీవలే వేదాంతా గ్రూప్‌ చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొనడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top