2500 యాప్స్ తొలగించిన గూగుల్ - నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

2500 యాప్స్ తొలగించిన గూగుల్ - లోక్‌సభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Published Tue, Dec 19 2023 11:04 AM

Google Removed 2500 Fraud Loan Apps From Play Store - Sakshi

చాలీ చాలని జీతాలతో పనిచేసే చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం.. లేకుంటే కొన్ని యాప్స్ నుంచి ఇన్‌స్టంట్ లోన్స్ తీసుకోవడం ఎక్కువైపోతోంది. బ్యాంకుల్లో లోన్ తీసుకునే వారి విషయం పక్కన పెడితే.. యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు ఏకంగా ప్రాణాలే తీసుకున్న సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' లోక్‌సభలో మాట్లాడారు.

2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్‌లను తొలగించినట్లు డిసెంబర్ 18న లోక్‌సభలో వెల్లడైన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్‌ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి వెల్లడించారు.

ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జనం కూడా ఫ్రాడ్ లోన్ యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: 2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే అంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వ చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) గూగుల్‌తో భాగస్వామ్యం చేసింది. ఈ యాప్‌లన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాలను లోబడి పనిచేయాల్సి ఉంటుంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement