
ఫోన్ల చోరీకి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చోరీకి గురైన ఫోన్లను దాదాపు నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ 16తో ముఖ్యమైన యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ అప్‌డేట్‌లో మెరుగైన భద్రతా సాధనాలు ఉంటాయి. ఇవి "ఓనర్ అనుమతి లేకుండా రీసెట్ చేసిన ఫోన్‌లు పనిచేయకుండా అవుతాయి" అని ఆండ్రాయిడ్ పరికరాల సమాచారాన్ని తెలిపే ‘ఆండ్రాయిడ్ పోలీస్’ అనే వెబ్‌సైట్ నివేదిక తెలిపింది.
గూగుల్ ఇటీవల 'ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్' సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (ఎఫ్ఆర్‌పీ) ను పెంచుతుంది. ఇది చోరీకి గురైన ఫోన్లను నిరుపయోగంగా చేయడానికి రూపొందించిన భద్రతా ఫీచర్. గూగుల్ ఆండ్రాయిడ్ 15 లో ఎఫ్ఆర్‌పీకి అనేక మెరుగుదలలు చేసింది. తదుపరి ఆండ్రాయిడ్ అప్డేట్ దీనిని మరింత బలోపేతం చేస్తుంది.
ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ, గూగుల్ ప్రణాళికలను తెలియజేసే ఒక స్క్రీన్ షాట్ ను ఆండ్రాయిడ్ పోలీస్ పబ్లిష్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ఫోన్ స్క్రీన్ పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ ఫ్లాషింగ్ ను చూపిస్తోంది. ఫోన్‌ను దొంగిలించినవారు ఒకవేళ సెటప్ విజార్డ్ ను చేయకపోతే రీసెట్ చేయకుండా ముందుకెళ్లలేరు. అంటే యూజర్ ఫోన్‌ను రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్‌ను నమోదు చేసే వరకు ఫోన్ పనిచేయదు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. కొత్త ఫీచర్ ఈ సంవత్సరం చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది.