భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్ హాల్‌మార్కింగ్, ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.
హాల్‌మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?
ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం హాల్‌మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.
బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.
22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.
18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.
హెచ్‌యూఐడీ నంబర్ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.
బీఐఎస్ కేర్ యాప్‌తో డిజిటల్ వెరిఫికేషన్
మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్ కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లోని ‘Verify HUID’ సెక్షన్‌లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్‌మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్‌తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.
క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్ టెస్ట్
నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్‌ఆర్‌ఎఫ్ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.
మ్యాగ్నెట్ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.
ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరి
కొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.
ప్రతి వస్తువు హెచ్‌యూఐడీ నంబర్.
బంగారం బరువు, దాని స్వచ్ఛత.
ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.
తయారీ ఖర్చులు, జీఎస్‌టీ.
ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా!


