డిమాండ్‌ భళా.. నిర్మాణాలు డీలా! | Geopolitical Tensions Slash India Office Construction Amid Rising Demand | Sakshi
Sakshi News home page

డిమాండ్‌ భళా.. నిర్మాణాలు డీలా!

Apr 20 2026 11:51 AM | Updated on Apr 20 2026 12:33 PM

Geopolitical Tensions Slash India Office Construction Amid Rising Demand

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో కార్యాలయ నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2026 గడిచిన మూడు నెలల్లో కొత్త కార్యాలయ భవనాల నిర్మాణంలో గణనీయమైన క్షీణత నమోదైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డెవలపర్లు ఆచితూచి అడుగులు వేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిర్మాణాల్లో 36 శాతం కోత

ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘వెస్టియన్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 జనవరి-మార్చి మధ్య కాలంలో కొత్త కార్యాలయ విస్తీర్ణం కేవలం 9.7 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. ఇది గత నాలుగు త్రైమాసికాల్లోనే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. గత త్రైమాసికంతో పోలిస్తే కొత్త నిర్మాణాల పూర్తి 36 శాతం మేర పడిపోయింది.

ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ఐటీ హబ్‌ల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముంబైలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ గత త్రైమాసికంలో 6.0 మిలియన్ చ.అడుగులుగా ఉన్న సరఫరా, ఈసారి ఏకంగా 95 శాతం తగ్గి కేవలం 0.3 మిలియన్ చ.అడుగులకు చేరుకుంది.

సరఫరాలోనే సంకటం

నిర్మాణాల్లో మందగమనం ఉన్నప్పటికీ ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ మాత్రం తగ్గలేదు. మొదటి త్రైమాసికంలో కార్యాలయ డిమాండ్‌ ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి 21.53 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను వ్యూహాత్మక కేంద్రంగా భావించి తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను విస్తరిస్తుండటమే ఈ డిమాండ్‌కు కారణం. ‘సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ప్రాజెక్టుల పూర్తి కావడాన్ని ఆలస్యం చేస్తున్నాయి. అయినప్పటికీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల నుంచి వస్తున్న నిరంతర లీజింగ్.. ప్రపంచ స్థాయిలో భారత్ ప్రాముఖ్యతను చాటుతోంది’ అని వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు అన్నారు.

ఇదీ చదవండి: సరిగా కొంటేనే.. బంగారం!

Advertisement
 
Advertisement
Advertisement