గో ఫస్ట్‌ లిక్విడేషన్‌ ప్రణాళికలు! | Sakshi
Sakshi News home page

గో ఫస్ట్‌ లిక్విడేషన్‌ ప్రణాళికలు!

Published Thu, Dec 7 2023 6:16 AM

Go First lenders closer to agreeing on liquidation - Sakshi

ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్‌ లిక్విడేషన్‌ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్‌ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్‌ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్‌ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది.

రుణదాతలలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, డాయిష్‌ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌ ఉన్నాయి. వీటిలో సెంట్రల్‌ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్‌ బ్యాంక్‌కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్‌కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్‌ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.  

రేసులో జిందాల్‌
గో ఫస్ట్‌ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్‌బ్యాక్‌ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్‌గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్‌బస్‌ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి.

గో ఫస్ట్‌ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్‌ పవర్‌ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్‌ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్‌ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్‌ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది.

Advertisement
 
Advertisement