3 నెలల్లో..రూ.77 వేల కోట్ల జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు!

Gem, jewellery exports grow by 21. 41percent to Rs 25,295 crore in June - Sakshi

జూన్‌లో రూ.25,295 కోట్లు

21 శాతం వృద్ధి నమోదు

న్యూఢిల్లీ: రత్నాభరణాల (జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ) ఎగుమతులు జూన్‌లో జోరుగా సాగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 21.41 శాతం వృద్ధితో రూ.25,295 కోట్ల విలువ మేర ఎగుమతులు నమోదైనట్టు.. జెమ్‌ అండ్‌ జ్యులయరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. 2021 జూన్‌ నెలలో ఎగుమతుల విలువ రూ.20,835 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) రత్నాభరణాల ఎగుమతులు 15 శాతం పెరిగి రూ.77,049 కోట్లుగా ఉన్నాయి.

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన ఎగుమతులు రూ.67,231 కోట్లుగా ఉండడం గమనార్హం. యూఏఈతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (భారత్‌–యూఏఈ సీఈపీఏ) చేసుకున్న తర్వాత మధ్య ప్రాచ్యానికి ఎగుమతుల్లో సానుకూల వృద్ధి కనిపించినట్టు జీజేఈపీసీ వివరించింది. కట్, పాలిష్డ్‌ వజ్రాల ఎగుమతులు జూన్‌లో 8 శాతానికి పైగా పెరిగి రూ.15,737 కోట్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు 35 శాతం వృద్ధితో రూ.5,641 కోట్లుగా ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో 35 శాతం పెరిగి రూ.6,258 కోట్లుగా ఉన్నాయి.  

యూఏఈతో ఒప్పందం ఫలితాలు
‘‘భారత్‌–యూఏఈ సీఈపీఏ మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే నెలలో ప్లెయిన్‌ గోల్డ్‌ జ్యుయలరీ ఎగుమతులు యూఏఈకి 72 శాతం పెరిగి రూ.1,048 కోట్లుగా ఉన్నాయి. జూన్‌లోనూ 68 శాతం పెరిగి రూ.1,451 కోట్లుగా ఉన్నాయి’’ అని జీజేఈపీసీ వెల్లడించింది. మొత్తం మీద ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు యూఏఈ వరకే ఎగుమతులు 10 శాతం వృద్ధితో రూ.9,803 కోట్లుగా నమోదయ్యాయి. ‘‘యూఏఈతో సీఈపీఏ ఒప్పందం వల్ల ప్లెయిన్‌ గోల్డ్‌ జ్యుయలరీ తక్షణమే లాభపడిన విభాగం. పరిమాణాత్మక మార్పును తీసుకొచ్చే విధానంతో మద్దతుగా నిలిచినందుకు వాణిజ్య శాఖకు ధన్యవాదాలు. ఈ ఒప్పందంలోని ప్రయోజనాలను భాగస్వాములు అందరూ వినియోగించుకుని లబ్ధి పొందాలి’’అని జీజేఈపీసీ చైర్మన్‌ కొలిన్‌ షా సూచించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top