ఈ రంగాలపై మక్కువ చూపుతున్న మగువలు

GE Avatar Reports Find Out Discrimination On Women In Workplace - Sakshi

తయారీ, ఇంజినీరింగ్‌ సర్వీసులపై మహిళల ఆసక్తి

కీలక విధులు నిర్వహించడంపై మరింతగా దృష్టి 

జీఈ, అవతార్‌ నివేదిక  

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ, ఆపరేషన్స్‌ తదితర విభాగాల్లో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని, కీలక విధులు నిర్వహించాలని మహిళలు భావిస్తున్నారు. అదే సమయంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఆయా రంగాలు గణనీయంగా ప్రయోజనం పొందగలవని పురుషులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం. జీఈ, అవతార్‌ రీసెర్చ్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ మధ్యలో జీఈ కోసం అవతార్‌ ఈ సర్వే నిర్వహించింది. 500 మంది ప్రొఫెషనల్స్‌ (మహిళలు, పురుషులు) ఇంజినీరింగ్‌ విద్యార్థినులు, ఆపరేషన్స్‌.. తయారీ.. ఇంజినీరింగ్‌ సర్వీసుల సంస్థల్లో బిజినెస్, మానవ వనరుల విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. 

పురోగతికి సామర్థ్యాలపై అపోహలే అడ్డంకి.. 
సర్వే ప్రకారం ఇంజినీరింగ్‌ సర్వీసులు, ఆపరేషన్స్, తయారీ వంటి రంగాల్లో ప్రస్తుతం 12 శాతం మందే మహిళలు ఉన్నారు. సామర్థ్యాలపై గల అపోహలే ఈ రంగాల్లో తమ కెరియర్‌ పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయని 63 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యాల మదింపు ప్రక్రియలో పక్షపాత ధోరణులు కూడా కారణమని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ నియంత్రణలే ఆయా విభాగాల్లో మహిళల వృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయని 54 శాతం మంది పురుషులు, సూపర్‌వైజర్‌ల నుంచి మద్దతు లేకపోవడం కారణమని 51 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు.

లింగవివక్ష
వివిధ విభాగాల్లో లింగ వివక్షకు తావులేకుండా పరిస్థితి మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సర్వే తెలియజేస్తోందని జీఈ దక్షిణాసియా ఐఅండ్‌డీ కౌన్సిల్‌ లీడర్‌ శుక్ల చంద్రా తెలిపారు. అటు, పెద్ద సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకుంటే మరింత మంది మహిళలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ వంటి విభాగాలను ఎంచుకునేందుకు, తయారీ.. ఇంజినీరింగ్‌ రంగాల్లో కెరియర్‌ ఏర్పర్చుకునేందుకు ప్రోత్సాహం లభించగలదని అవతార్‌ వ్యవస్థాపక ప్రెసిడెంట్‌ సౌందర్య రాజేశ్‌ తెలిపారు.

చదవండి:అబల కాదు.. ఐరన్‌ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top