
శ్రీకాళహస్తికి చెందిన ఓ జంటకు గతేడాది వివాహం జరిగింది. గర్భం దాల్చడంతో కుటుంబ పెద్దల లింగ నిర్ధారణ పరీక్షల కోసం స్థాకంగా ఉన్న ఓ డాక్టర్‌ను సంప్రదించారు. తమకు తొలి సంతానం పురుషుడు కావాలని చెప్పారు. వెంటనే ఆ వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో పెరుగుతోంది బాలిక ఆనవాళ్లు అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లింగ నిర్ధారణకు రూ. 45 వేలు, గర్భస్రావానికి సుమారు రూ. 35 వేలు దండుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
నాయుడు పేటకు చెందిన ఓ జంటకు ఇప్పటికే ఇద్దరు బాలికలు పుట్టారు. తమకు వంశోద్ధారకుడు కావలంటూ మూడవసారి ప్రెగ్నెన్సీ కావడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దీంతో మూడవ సారి సైతం బాలిక పుట్టే ఆనవాళ్లు ఉన్నాయంటూ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చెందిన డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు గర్భస్రావం చేయాలని బంధువులు కోరారు. దీంతో పరీక్షించి డాక్టర్లు ఆ మాతృమూర్తి బంధువుల నుంచి వేలకు వేలు దండుకుని పని పూర్తి చేశారు.
అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..అర్ధాంగిగా.. చెయ్యిపట్టి నడిపించే ఆడబిడ్డకు కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ఆడపిల్ల భారమనుకునే రోజుల నుంచి ఆడబిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడపిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భ్రూణ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లింగ నిర్ధారణ మాఫియా రెచ్చిపోతున్నా వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులోనే జోగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.
సాక్షి ప్రతినిధి తిరుపతి : అయ్యో.. మాతృమూర్తుల కడుపులు చిదిమేస్తున్నారే... ప్రెగ్నెస్సీ అయిన నవ వధువులను సైతం వదలకుండా తొలి ప్రసవంలోనే మగబిడ్డ పుట్టాలంటూ స్కానింగ్ చేయించి రక్త ముద్దలపై దాడిచేసి హత్య చేస్తున్నారు. జిల్లాలో రోజు రోజుకు విచ్చలవిడిగా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నా మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు, దేశంలోనే పేరొందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో సైతం బాలికల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. లింగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విచ్చల విడిగా ఏర్పాటు చేసుకుని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ముట్టచెప్పి లింగనిర్ధారణ పరీక్షల మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో బ్రూణ హత్యలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై వైద్య శాఖలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సైతం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు,
జిల్లాలో పడిపోతున్న బాలికల జనన రేటు
జనగణన 2018 ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెయ్యి మంది బాలురకు 922 మంది బాలికలు ఉన్నారు. అదే 2021 లెక్కలకొచ్చేసరికి ఈ సంఖ్య 901కి పడిపోయింది. జిల్లాల విభజన అనంతరం 2024లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం తిరుపతి జిల్లాలో బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగి 916కు చేరింది. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం జిల్లా నిష్పత్తికి వ్యతిరేకంగా నానాటికీ బాలికల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. బాలురు – బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేనే బాలికల నిష్పత్తి పడిపోకుండా ఆపగలమని మేధావులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో తొలి సంతానం మగబిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. లేకుంటే పిండ దశలోనే చిదిమేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మొద్దునిద్రలో వైద్యాధికారులు
జిల్లాలో బాలురు– బాలికల నిష్ఫత్తి దారుణంగా ఉందన్న విషయాన్ని కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఈ అంశాన్ని బహిర్గతం చేయడం గమనార్హం. ఆరేళ్లలోపు బాలల్లో బాలికలు అతి తక్కువగా ఉన్న మండలాల్లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా వైద్యాధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున బ్రూణ హత్యలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిబంధనను అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టకపోవడంతో ఆడ నలుసు అమ్మ గర్భంలోనే అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆడ–మగ నిష్పత్తి వెయ్యికి తొమ్మిది వందలు ఉండగా శ్రీకాళహస్తిలో మాత్రం వెయ్యికి 629 మందే ఆడ బిడ్డలే ఉండటం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.
వంశోద్ధారకుడు కావాలనే మూఢ నమ్మకం..
ముందు మగబిడ్డ పుడితే చాలు.. ఆ తర్వాత ఎవరూ పుట్టినా పర్వాలేదు. మళ్లీ మగ బిడ్డ పుడితే ఇంకా మేలే.. ఒకవేళ ఆడ బిడ్డ పుట్టినా.. కొడుకూ, కూతురు పుట్టిందని సంబర పడిపోతాం.. ఇదీ ప్రస్తుత సమాజంలో పిల్లలు కావాలంకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి. ముందు కొడుకు పుట్టి మరో సంతానంగా కూతురు పుడితే అక్కడితో ఆపేస్తున్నారు. అలా కాకుండా ముందు ఎంత మంది కూతుళ్లు పుట్టినా కొడుకు కోసం కొందరు ఆరాటపడుతున్నారు. ఇంకొందరు కొడుకుల కోసం ఆడ నలుసులను గర్భంలోనే నులిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాళహస్తి ప్రాంతంలో వీధికో గాథ బయటపడుతోంది. ఇలా ఆడ నలుసు పురిటిలో కళ్లు కూడా తెరవకముందే బ్రూణ హత్యలకు గురవుతుంటే మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా వైద్య శాఖ నిద్ర మేల్కొని లింగ నిర్ధారణ, గర్భ స్రావాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గర్భస్రావాలకు ప్రత్యేక ధర
లింగ నిర్ధారణ స్కానింగ్ కోసం సుమారు రూ.25 నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తుండగా గర్భస్రావం చేయించేందుకు మరో రేటు తీసుకుంటున్నారు. తిరుపతిలో అయితే రూ.25 వేలు, గూడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ఇతర ఆసుపత్రుల్లో రూ.20 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఆసుపత్రులు ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నాయి. గర్భం దాలి్చన 20 వారాల తర్వాత గర్భ విచ్ఛిత్తి చేయడం అత్యంత ప్రమాదకరం. అందుకే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, చట్టాలు తీసుకొచ్చాయి. కొందరు ధనార్జన కోసం ఇష్టారీతిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలతో గర్భస్రావాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ ప్రభావం లింగ నిష్పత్తిపై పడుతోంది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి నగరాల్లో ప్రసూతి ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
కేసులు నమోదు చేస్తాం
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దీనిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో స్పెషలిస్ట్ డాక్టర్లు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి వైద్యాధికారి ఈ కమిటీలో ఉంటారు. సమగ్రంగా దీనిపైన విచారించి ఒక నెల రోజుల్లో కలెక్టర్ కు నివేదిక సమరి్పస్తాం. గతంలో ఈ విధంగా స్కానింగ్ చేస్తూ దొరికిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేసి మిషన్లు కూడా స్వా«దీనం చేసుకున్నాం. వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పు చేసినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లింగనిర్ధార ణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం.
– డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్‌ఓ, తిరుపతి
రూ.కోట్లలో వ్యాపారం
లింగ నిర్ధారణ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. దళారులు గర్భిణులను, సంబం«దీకులను గుట్టుగా తిరుపతి, గూడూరు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. గర్భిణితో ఎక్కువ మంది రాకుండా, ఆమెతో పాటు మరొకరిని వెంటబెట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలిస్తారు. ఆస్పత్రి పేరుగానీ, చిరునామాగానీ ఎలాంటివి చెప్పకుండానే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ.. మగ చెప్పి రిపోర్టులు చేతికి ఇవ్వకుండా పంపేస్తున్నారు.
విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు
పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం.
గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.