అంబుజా, ఏసీసీ వాటాను తనఖాలో ఉంచిన అదానీ గ్రూప్‌ | Sakshi
Sakshi News home page

అంబుజా, ఏసీసీ వాటాను తనఖాలో ఉంచిన అదానీ గ్రూప్‌

Published Thu, Sep 22 2022 8:04 AM

Gautam Adani Signs Ambuja And Acc Stake To Funding 13 Billion Dollar - Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ ఇటీవల సొంతం చేసుకున్న అంబుజా సిమెంట్స్, ఏసీసీలలో వాటాను తనఖాలో ఉంచింది. మొత్తం 13 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 1,04,000 కోట్లు) విలువైన వాటాను తనఖా పెట్టింది. డాయిష్‌ బ్యాంక్‌ ఏజీ హాంకాంగ్‌ బ్రాంచీ వద్ద అంబుజా సిమెంట్స్‌లో 63.15 శాతం వాటాతోపాటు.. ఏసీసీలోని 56.7 శాతం వాటా(అంబుజా ద్వారా 50 శాతం వాటా)ను కుదువ పెట్టినట్లు అదానీ గ్రూప్‌ తాజాగా వెల్లడించింది. కొద్ది రోజులక్రితమే ఈ వాటాలను 6.5 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా చర్య కొంతమంది రుణదాతలు, ఫైనాన్స్‌ భాగస్వాములకు లబ్ది చేకూర్చగలదని అదానీ గ్రూప్‌ ఈ సందర్భంగా పేర్కొంది. రానున్న ఐదేళ్లలో సిమెంట్‌ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపునకు పెంచుకునే ప్రణాళికలు వెల్లడించిన నేపథ్యంలో తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక సిమెంట్‌ సామర్థ్యాన్ని 14 కోట్ల టన్నులకు చేర్చే ప్రణాళికల్లో ఉన్నట్లు గ్రూప్‌ చీఫ్‌ గౌతమ్‌ అదానీ రెండు రోజులక్రితం వాటాదారులకు వెల్లడించారు. తద్వారా దేశీయంగా అత్యంత లాభదాయక కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేశారు.

అత్యుత్తమ ఆర్థిక పురోగతి, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ కట్టుబాటు వంటి అంశాలు సిమెంటుకు భారీ డిమాండును సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మార్జిన్లు అత్యధి క స్థాయిలో మెరుగుపడనున్నట్లు అంచనా వేశారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో అంబుజా సిమెంట్స్‌ షేరు 6 శాతం పతనమై రూ. 539 వద్ద ముగిసింది. ఏసీసీ సైతం 7 శాతం తిరోగమించి రూ. 2,535 వద్ద స్థిరపడింది.

చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్‌ జెట్‌.. 3 నెలల పాటు 

Advertisement
Advertisement