డీల్ ఓకే : అమెజాన్‌కు ఎదురుదెబ్బ

Future Retail-Reliance deal gets SEBI nod - Sakshi

 రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సెబీ ఆమోదం

సాక్షి, ముంబై: ఫ్యూచర్‌ గ్రూపు, అమెజాన్ ‌మధ్య వివాదంలో అమెజాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కిశోర్ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్ గ్రూప్, ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్  రిటైల్ డీల్‌కు అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)  తాజాగా ఆమోద ముద్ర వేసింది. అయితే  అమెజాన్  అభ్యంతరాలపై వివరణ కోరింది.  (అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్‌ బియానీ

అలాగే కీలక ఒప్పందాల సమయంలో ఎలాంటి వివాదం ఉన్నా ముందుగా తనతో పాటు,షేర్ హోల్డర్స్ కు కూడా సమాచారం అందించాలని  సెబీ తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ దృష్టికి తీసుకురావాలని  కూడా స్పష్టం చేసింది. అలాగే ఈ ఒప్పందంలో భాగంగా యాజమాన్యం మార్పునకు సంబంధించి  న్యాయపరంగా చిక్కులు లేకుండా రూట్ మ్యాప్ సమాచారాన్ని కూడా అందించాలని సెబీ ఆదేశించింది. ఆగస్టు 29, 2020న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ వాటాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు గత ఏడాది నవంబరులోనే సీసీఐ అంగీకారం  లభించగా, తాజాగా సెబీ కూడా ఆమోద్రముద్ర వేసింది.

కాగా,ఈ ఒప్పందంపై అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ  సింగపూర్‌  అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. ఫ్యూచర్ లోని కూపన్ విభాగంలో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉన్న నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వకుండానే ఎలా విక్రయిస్తారని ప్రశ్నించింది. దీనికి తమకు నష్టపరిహారం కావాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే నిబంధనల ప్రకారమే ఈ డీల్‌ ఉందని, అమెజాన్‌కు పరిహారం చెల్లించే ప్రశ్నేలేదని ఫ్యూచర్‌ గ్రూపు తెగేసి చెప్పింది. అమెజాన్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని  వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రిలయన్స్‌, ఫ్యూచర్‌ డీల్‌కు‌ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ లభించన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.46 శాతం లాభంతో  రూ. 2105 వద్ద కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top