చిరు వ్యాపారులు, మధ్యతరగతిపై ఫోకస్‌

Fresh Stimulus Package On Its Way - Sakshi

తదుపరి ప్యాకేజ్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించేందుకు కసరత్తు చేపడుతోంది. ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతితో పాటు  చిన్న వ్యాపారులను ఆదుకోవడంపై ఈసారి ప్రభుత్వం దృష్టిసారించింది. రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలోనే ఆశించవచ్చని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వీ సుబ్రమణియన్‌ ఇటీవల పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సంకేతాలను ఆయన ప్రకటన స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ ముగియడంతో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు, సేవలు అందుబాటులోకి రావడంతో తాజా ప్యాకేజ్‌తో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక అత్యున్నత భేటీలను నిర్వహించడం కూడా రాబోయే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు పెంచుతోంది. మరోవైపు ఇటీవల వెల్లడైన జీడీపీ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజాన్ని వెల్లడించడంతో తదుపరి ప్యాకేజ్‌ను ప్రకటించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో దేశ జీడీపీ 23.9 శాతం తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కోవిడ్‌-19తో అత్యధిక ప్రభావానికి గురైన దేశంగా భారత్‌ నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన క్వార్టర్లలోనూ ఇవే సవాళ్లు ఎదురవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి రోడ్‌మ్యాప్‌ రూపకల్పనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తును వేగవంతం చేసింది. చదవండి : చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం

పండుగల సీజన్‌ రాబోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిమాండ్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి చర్యలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వ అధికారులు తరచూ కార్పొరేట్‌ నేతలతో సమావేశమవుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నారు. డిమాండ్‌ విపరీతంగా పడిపోయిన క్రమంలో డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టాలని వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి విస్పష్టంగా సూచిస్తున్నాయి.

చిరు వ్యాపారులు, మధ్యతరగతికి ఊరట
తాజా ప్యాకేజ్‌లో చిన్న వ్యాపారాలను కాపాడటం, మధ్యతరగతికి మేలు చేసే చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్యాకేజ్‌ పరిమాణం, ఏ సమయంలో ప్రకటించాలనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు ఓ జాతీయ వెబ్‌సైట్‌ వెల్లడించింది. మధ్యతరగతి వర్గంతో పాటు  చిన్నవ్యాపారాలకు ఊతమివ్వాలని నీతి ఆయోగ్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధికారులు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. రాబోయే ఉద్దీపన ప్యాకేజ్‌ ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేని రీతిలో సమస్యలను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రత్యక్షంగా ఆర్థిక ఊతమిచ్చే చర్యలు తక్షణం చేపట్టాలని పలువురు ఆర్థికవేత్తలు కోరుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top