మార్కెట్లకు ఎఫ్‌పీఐల దన్ను

FPI investments lifts sensex to cross 40000 point mark - Sakshi

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు

ఆగస్ట్‌లో ఈక్విటీలలో రూ. 46,602 కోట్లు

రుణ సెక్యూరిటీలలో రూ. 732 కోట్లు 

తాజాగా 40,000 పాయింట్ల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

జులైలో రూ. 3,301 కోట్లే- జూన్‌లో రూ. 24,053 కోట్లు

ఓవైపు కోవిడ్‌-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమన పథంలో పడినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో తాజాగా మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఆరు నెలల తదుపరి 40,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు ఇలా..

ఆగస్ట్‌లో స్పీడ్‌
ఈ నెలలో శుక్రవారం వరకూ(3-28) ఎఫ్‌పీఐలు దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో రూ. 47,334 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. వీటిలో రూ. 46,602 కోట్లను ఈక్విటీ కొనుగోలుకి వెచ్చించగా.. రూ. 732 కోట్లను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్‌ చేశారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. కాగా.. జులైలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 3,301 కోట్లకు పరిమితంకాగా.. జూన్‌లో రూ. 24,053 కోట్ల విలువైన స్టాక్స్‌ నికరంగా సొంతం చేసుకున్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్‌ నుంచి ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 80,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. వీటిలో ఆగస్ట్‌ పెట్టుబడులే అధికంకావడం గమనార్హం!

కారణాలున్నాయ్‌
కరోనా వైరస్‌ విలయంతో ఈ ఏడాది తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ 19 శాతం క్షీణించవచ్చన్న అంచనాలున్నప్పటికీ రెండో త్రైమాసికం నుంచీ రికవరీ బాట పట్టవచ్చన్న ఆశలు ఎఫ్‌పీఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకుంటున్న లిక్విడిటీ పెంపు, రేట్ల కోత వంటి చర్యలు దోహదపడనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. లాక్‌డవున్‌ల ఎత్తివేత తదుపరి పలు రంగాలలో డిమాండ్‌ కనిపిస్తుండటంతో కంపెనీలు సైతం మెరుగైన ఫలితాలు ప్రకటించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పలు అంశాలు.. వర్ధమాన దేశాలలోకెల్లా  దేశీ మార్కెట్లను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి జతగా గత వారాంతాన యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సైతం వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే మరికొంత కాలం కొనసాగించనున్నట్లు స్పష్టం చేయడంతో ఇకపైన కూడా విదేశీ పెట్టుబడుల రాక కొనసాగవచ్చని  కొటక్‌ సెక్యూరిటీస్‌, మార్నింగ్‌ స్టార్‌, గ్రో తదితర రీసెర్చ్‌ సంస్థల నిపుణులు ఊహిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top