Ford India Shutdown: భారత్‌కు దిగ్గజ కంపెనీ గుడ్‌బై, పరిహారంపై రాని స్పష్టత

Ford India Shutdown 4,000 Employees Could Lose Jobs - Sakshi

న్యూఢిల్లీ: అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ ..భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తమ పరిహారంపై స్పష్టతనివ్వాలని దేశీ ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ డిమాండ్‌ చేసింది. ఫోర్డ్‌ ఇండియా ఎండీ అనురాగ్‌ మెహ్రోత్రాకు ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ వింకేష్‌ గులాటీ ఈ మేరకు లేఖ రాశారు. 

ఫోర్డ్‌ ప్లాంట్ల మూసివేత ప్రకటనతో కొనుగోలుదారులంతా బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారని, దీంతో డీలర్లు భారీగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలా మంది డీలర్‌షిప్‌లు తీసుకుని అయిదేళ్లు కూడా కాలేదని, కనీసం బ్రేక్‌ ఈవెన్‌ స్థాయి కూడా అందుకోలేదని గులాటీ తెలిపారు. పరిహారానికి సంబంధించి ఫోర్డ్‌ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి ఉంటుంది కాబట్టి దాన్ని తమకు తెలియజేస్తే డీలర్లకు వివరించడానికి వీలవుతుందని, ఈ ప్రక్రియ సామరస్యంగా ముగిసేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.  

డీలర్లకు పంపిన నాన్‌–డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌ (ఎన్‌డీఏ)లోనూ పలు వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయని, వాటిని సవరించాలని.. తగు రీతిలో స్పష్టతనివ్వాలని గులాటీ కోరారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లోని రెండు ప్లాంట్లలోనూ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, ఇకపై కేవలం దిగుమతి చేసుకున్న వాహనాలే విక్రయిస్తామని ఫోర్డ్‌ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 4,000 మంది పైచిలుకు ఫోర్డ్‌ ఉద్యోగులపైనా, దాదాపు 300 పైగా అవుట్‌లెట్స్‌ను నిర్వహించే 150 మంది డీలర్లపైనా  తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కంపెనీ గత పదేళ్ల కాలంలో భారత మార్కెట్లో సుమారు 2 బిలియన్‌ డాలర్ల నిర్వహణ నష్టాలు చవిచూసింది.  

చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top