తగ్గుతున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం

Fmcg Industry Sees Consumption Decline Over Amid Price Hikes - Sakshi

న్యూఢిల్లీ: ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం మందగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పరిమాణం మరింతగా పడిపోతోంది. డేటా అనలిటిక్స్‌ సంస్థ నీల్సన్‌ఐక్యూ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల (ప్యాకేజ్డ్‌ ఆహార, ఆహారయేతర ఉత్పత్తులు మొదలైనవి) విక్రయ పరిమాణం 0.9 శాతం తగ్గింది. ఇలా అమ్మకాల పరిమణం వృద్ధి మందగించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం.

వరుసగా గత ఆరు త్రైమాసికాల్లో రేట్లు రెండంకెల స్థాయిలో పెరగడం దీనికి దారి తీసిందని నివేదిక వివరించింది. గ్రామీణ మార్కెట్లలో అమ్మకాల పరిమాణం జూన్‌ త్రైమాసికంలో 2.4 శాతం క్షీణించగా, సెప్టెంబర్‌ త్రైమాసికంలో 3.6 శాతం తగ్గింది. అయితే, ఇదే వ్యవధిలో పట్టణ ప్రాంత మార్కెట్లలో విక్రయాల పరిమాణం 1.2 శాతం పెరిగింది. ఆహార ఉత్పత్తుల అమ్మకాలు 3.2 శాతం పెరిగాయి. రేట్ల పెంపు నేపథ్యంలో విలువపరంగా చూస్తే .. జూన్‌ త్రైమాసికంతో పోల్చినప్పుడు సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీ ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.9 శాతం మేర వృద్ధి చెందినట్లు నివేదిక వివరించింది. ఇక పరిమాణం, విలువపరంగా చూసినా అమ్మకాలు కోవిడ్‌ పూర్వ స్థాయికి (2020 మార్చి త్రైమాసికం) మించి నమోదయ్యాయి. మహమ్మారి ప్రభావం తగ్గాక మార్కెట్లు పూర్తిగా తెరుచుకోవడం ఇందుకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది.  

నివేదికలోని మరిన్ని అంశాలు ..  
రేట్ల పెరుగుదల నేపథ్యంలో వినియోగదార్లు ఎక్కువగా చిన్న ప్యాక్‌లవైపు మొగ్గు చూపడం కొనసాగుతోంది. కంపెనీలు చాలా మటుకు ఉత్పత్తులను కొత్తగా చిన్న ప్యాక్‌ల్లో ప్రవేశపెడుతున్నాయి. ముడి వస్తువుల ధరలు ఇంకా అధిక స్థాయిలో కొనసాగుతుండటమే కారణం. హైపర్‌మార్కెట్లు, సూపర్‌మార్కెట్లు, మాల్స్‌ మొదలైనవి .. విలువపరంగా (22 శాతం అధికం), పరిమాణంపరంగా (11 శాతం వృద్ధి) మెరుగ్గా రాణిస్తున్నాయి. చిన్న తయారీ సంస్థలు, టాప్‌ 400 ఎఫ్‌ఎంసీజీ సంస్థలు .. వినియోగ చోదకాలుగా ఉంటున్నాయి. గత 2–3 త్రైమాసికాలుగా విలువ, పరిమాణంలో వాటి వాటా పెరుగుతోంది.

చదవండి: అమలులోకి కొత్త రూల్‌.. ఆ సమయంలో ఎస్‌ఎంఎస్‌ సేవలు బంద్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top