వాహనదారులకు భారీ షాక్..ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష!

Fine Up To Rs 10,000, Jail For Vehicle Without Fitness Certificate In Delhi - Sakshi

వాహనదారులకు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని ప్రైవేట్‌, ప్రభుత్వ వాహనాల యజమానులకు రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష విధిస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు.  

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇన్ని రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. అదే సమయంలో వాహనాల రాకపోకళ్లు పెరిగి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ - గురుగ్రావ్‌ మార్గాల్లో  2020లో 347 మంది, 2021లో 10శాతం పెరిగి 389 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2020లో 375 మంది తీవ్రంగా గాయపడగా.. 2021లో 409 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

అయితే ఈ వరుస ప్రమాదాల నుంచి వాహనదారుల్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్‌ లేని వాహనాల్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో "ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనాలకు ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది మోటారు వాహనాల (ఎంవీ) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్‌ నోటీస్‌లో పేర్కొంది.

 

అందుకే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరైన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనాల్ని నడిపే వాహనదారులకు మొదటి తప్పుకు రూ. 2,000-5,000, రెండవ, మూడవ నేరం కింద రూ.5,000-10,000 జరిమానా విధిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో యజమాని లేదా డ్రైవర్‌కు జైలు శిక్ష విధించే నిబంధన కూడా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు విడుదల చేసిన నోటీస్‌లో హైలెట్‌ చేశారు. ఇ-రిక్షాలు, ఇ-కార్ట్స్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం, ఫిటెనెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున అదనంగా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి👉 ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top