భారత్‌ ఎకానమీపై భరోసా

Expect Indias GDP to moderate to 6percent in FY24 - Sakshi

7 శాతం వృద్ధి తగ్గదు  

ఆర్థికశాఖ నివేదిక

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7 శాతంగా నమోదవుతుందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) జనవరిలో 25 నెలల కనిష్ట స్థాయి తరహాలోనే రిటైల్‌ ద్రవ్యోల్బణం తీవ్రతా తగ్గుతుందని అంచనావేసింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కట్టడిలో ఉండడం ఈ అంచనాలకు కారణమని తెలిపింది. ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% దిగువ కు రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనావేస్తున్నాట్లు పేర్కొంది.  ఈ మేరకు విడుదలైన నెల వారీ ఆర్థిక సమీక్షలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
 
► అధిక సేవల ఎగుమతుల నుంచి పొందుతున్న లాభాలు, చమురు ధరలు అదుపులో ఉండడం,  దిగుమతి ఆధారిత వినియోగ డిమాండ్‌లో ఇటీవలి తగ్గుదల కారణంగా దేశ కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందని భావించడం జరుగుతోంది. ఈ పరిస్థితి రూపాయి అనిశ్చితి పరిస్థితి కట్టడికి దోహదపడుతుంది. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటు  మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాడ్‌ కట్టడిలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అవకాశం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్‌ రంగానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపబోవు.  
► భారత్‌ సేవల రంగం ఎగుమతుల విషయంలో పురోగతి దేశానికి ఉన్న మరో బలం. కరోనా సవాళ్లు తొలగిన నేపథ్యంలో ఐటీ, నాన్‌–ఐటీ సేవల విషయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ వాటా పెరుగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో దిగుమతుల బిల్లు కూడా దేశానికి కలిసి వస్తోంది.  
► తైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేయడం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా యి. 2023లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా భారీ వసూళ్లు వరుసగా 12వ నెల.  
► భారతదేశ కార్పొరేట్‌ రంగం రుణ–జీడీపీ నిష్ప త్తి చారిత్రక రేటు కంటే తక్కువగా ఉంది.  ఇది కార్పొరేట్‌ రంగానికి మరింత రుణం తీసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్థిక  వ్యవస్థ  స్థిరత్వాన్ని కొనసాగించడంలో కార్పొరేట్ల రుణ ప్రొఫైల్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top