చదువు మధ్యలో వదిలేశారా? ఆందోళన వద్దు.. | Engineering Dropout Reddit Sparks Viral Debate Career Pressure Mental Health | Sakshi
Sakshi News home page

చదువు మధ్యలో వదిలేశారా? ఆందోళన వద్దు..

May 8 2026 8:44 AM | Updated on May 8 2026 8:54 AM

Engineering Dropout Reddit Sparks Viral Debate Career Pressure Mental Health

కెరీర్ రీ-బిల్డింగ్‌కు ఇవే మార్గాలు!

దశాబ్దాలుగా మన దేశంలో ఇంజినీరింగ్ అంటే ఒక సురక్షితమైన భవిష్యత్తుకు భరోసా. కానీ, ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ డిగ్రీ మాయాజాలంలో చిక్కుకుని తీరా కొంతకాలం చదివాక తమ దారి తప్పిందని గ్రహిస్తున్నారు. ఇటీవల 21 ఏళ్ల యువకుడు రెడ్డిట్ వేదికగా పంచుకున్న అంశాలు నేటి తరం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు అద్దం పడుతోంది. మెకానికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో డ్రాపౌట్ అయిన ఆ యువకుడి కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది.

రెడ్డిట్‌ పోస్ట్‌లోని వివరాల ‍ప్రకారం.. 17 ఏళ్ల వయసులో సమాజం, తల్లిదండ్రుల ఒత్తిడితో మెకానికల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నాడు. కానీ 21 ఏళ్లకు వచ్చేసరికి ఆ సబ్జెక్టులు అతనికి చాలా కష్టంగా అనిపించాయి. చేసే పనిపై ఇష్టం లేనప్పుడు ఆ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఒకవైపు కోర్సు పూర్తికాకపోవడం, మరోవైపు బయట గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతుండటం అతన్ని భయపెట్టాయి. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక మందగమనం వల్ల ఏ రంగం సురక్షితమో తెలియని అయోమయం అతడిని చుట్టుముట్టింది. తనకు పెద్ద పెద్ద హోదాల కంటే ఆచరణాత్మకమైన జీవితం కావాలి. కనీసం 40,000 డాలర్ల(సుమారు రూ.33 లక్షలు) వార్షిక ఆదాయం, గౌరవప్రదమైన సామాజిక వృత్తి ఉంటే చాలని అతను కోరుకుంటున్నాడు. కానీ ఇంజినీరింగ్ మానేశాక, ఆ స్థాయికి ఎలా వెళ్లాలో తెలియక పార్ట్-టైమ్ ఉద్యోగంతో కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు.

భావోద్వేగాల కంటే దిశానిర్దేశం ముఖ్యం

చాలామంది ఇంజినీరింగ్ మధ్యలో ఆపేయడాన్ని ఒక వ్యక్తిగత వైఫల్యంగా భావిస్తారు. కానీ వాస్తవానికి, భవిష్కత్తుపై స్పష్టమైన సంకేతం. ఆ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది. ల్యాబ్‌లు, కఠినమైన కోర్సు వర్క్ అతనికి సరిపడలేదు.

డ్రాపౌట్ అవ్వడం అంటే కెరీర్ ముగిసిపోవడం కాదు. అది కేవలం ఒక రీసెట్ బటన్ మాత్రమే. విశ్లేషణల కంటే ఆచరణాత్మక మార్పు కీలకం.

డిగ్రీ లేదు సరే.. నైపుణ్యాల మాటేమిటి?

సదరు యువకుడు తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల నమ్మకంగా ఉన్నాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంజినీరింగ్ పూర్తి చేయకపోయినా అతనికి ఉన్న టెక్నికల్ పరిజ్ఞానం ఇతర రంగాల్లో ప్లస్ పాయింట్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్‌) సాంకేతికతపై అవగాహన ఉండి బాగా మాట్లాడితే ఈ రంగంలో ఏడాదికి 40,000 డాలర్లు (సుమారు రూ.33 లక్షలు) కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వారికి వైద్య రంగంలోని యంత్రాల గురించి త్వరగా అవగాహన కలుగుతుంది. రియల్ ఎస్టేట్, బిజినెస్ రంగంలో కస్టమర్లతో డీల్ చేయగలిగే నేర్పు ఉంటే ఇక్కడ ఆకాశమే హద్దు.

ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ

కేవలం వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా 'ట్రేడ్ స్కిల్స్' వైపు చూడటం కూడా మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. లో-వోల్టేజ్ టెక్నీషియన్, ఏవియేషన్ మెకానిక్స్ వంటి రంగాల్లో అప్రెంటిస్‌షిప్ ద్వారా నేరుగా ఆదాయం పొందవచ్చు. సర్టిఫికేషన్ కోర్సుల్లో భాగంగా అకౌంటింగ్ లేదా డేటా అనలిటిక్స్ వంటి స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసి త్వరగా స్థిరపడవచ్చు.

కెరీర్ పునర్నిర్మాణానికి..

  • ఆందోళనను పక్కన పెట్టి గత అనుభవాన్ని విశ్లేషించుకోవడం.

  • మీకు ఉన్న బలాలు (ఉదా: సేల్స్, డ్రాయింగ్, కోడింగ్) గుర్తించడం.

  • ఎంచుకున్న రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగంలో చేరడం.

  • కృత్రిమ మేధ వంటి మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకోవడం.

డిగ్రీ ఒక అధ్యాయం మాత్రమే..

ఇంజినీరింగ్ మధ్యలో వదిలేశాను అన్న మాట వినడానికి కాస్త కఠినంగా ఉండవచ్చు. కానీ, ప్రపంచ ప్రఖ్యాత విజేతలు చాలామంది తమ కెరీర్ ప్రారంభంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నవారే. డ్రాపౌట్ అవ్వడం వల్ల అవకాశాలు తగ్గిపోవు. కానీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోవడం వల్ల మాత్రమే ఎదుగుదల ఆగిపోతుంది. ఆర్థిక స్థిరత్వం అనేది కేవలం డిగ్రీతోనే రాదు. మనం చేసే పనిలో చూపే ప్రతిభతో వస్తుందని గుర్తుంచుకోవాలి.

ఇదీ చదవండి: రూ.28 లక్షల జాబ్‌ వదులుకున్న మేనేజర్

Advertisement
 
Advertisement
Advertisement