కార్పొరేట్ ప్రపంచంలో ప్రమోషన్ అనేది ఒక అపురూపమైన మైలురాయి. హోదా, భారీ వేతనం, సమాజంలో గుర్తింపు.. వీటి కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తుంటారు. కానీ, ఆ ఊహల పల్లకీ ఒక్కోసారి ఊపిరి సలపని ఉచ్చుగా మారుతుందని హర్మన్ జోత్ కౌర్ ఉదంతం నిరూపిస్తోంది. ఏడాదికి రూ.28 లక్షల వేతనం వచ్చే సీనియర్ మేనేజర్ పదవిని తృణప్రాయంగా వదులుకుని ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎనిమిదేళ్ల నిరీక్షణ.. తీరా చూస్తే?
హర్మన్ జోత్ కౌర్ ఎనిమిదేళ్ల పాటు సంస్థ కోసం తీవ్రంగా పనిచేసింది. ఆమె కష్టానికి ఫలితంగా 2025లో ఆమెకు సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి లభించింది. రూ.28 లక్షల భారీ ప్యాకేజీ. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం, స్నేహితుల అభినందనలు. తను అనుకున్న గమ్యాన్ని చేరానన్న తృప్తి ఆమెలో ఉండేది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.
పదవి తెచ్చిన ప్రమోషన్ ట్రాప్
కొత్త బాధ్యతలు పెరగడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. ఈ మార్పును వివరిస్తూ.. ‘రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పనిలోనే గడపాల్సి వచ్చేది. పని ఒత్తిడిలో పడి నా కుమార్తె మొదటి స్కూల్ ఫంక్షన్‌కు కూడా వెళ్లలేకపోయాను. నిరంతర ఆందోళన కారణంగా బీపీ, షుగర్ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. మీటింగ్‌లకు వెళ్లేముందు భయాందోళనలు మొదలయ్యాయి. వృత్తిపరమైన ఒత్తిడి ప్రభావం వైవాహిక జీవితంపై పడి అది విచ్ఛిన్నమయ్యే స్థాయికి చేరుకుంది. ఒకరోజు ఆఫీస్ వాష్‌రూమ్‌లో ఒంటరిగా ఏడ్చేశాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. చేతిలో మరో ఉద్యోగం లేకపోయినా అదే వారంలో రాజీనామా చేశాను’ అని కౌర్ తన ఆవేదనను పంచుకున్నారు.
వెనక్కి తగ్గుదాం..
రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పంజాబ్‌లో సొంతంగా ఒక చిన్న ఏఐ సర్వీస్ స్టార్టప్‌ను నడుపుతున్నారు. ‘మునుపటి కంటే ఇప్పుడు సంపాదన తక్కువే కావచ్చు. కానీ ప్రశాంతంగా నిద్రపోతున్నాను. నా కుటుంబంతో గడుపుతున్నాను. నేను వెంబడించిన ఆ ప్రమోషన్ నేను నిర్మించుకున్న ఒక పంజరంగా అనిపించింది’ అని ఆమె పేర్కొన్నారు.
🚨 The promotion I worked 8 years for almost destroyed me.
2025: Finally promoted to Senior Manager - ₹28 LPA.
Everyone congratulated me. Parents were proud. I thought I had “arrived”.
6 months later:
• 14–16 hour days became normal
• Missed my daughter’s first school…— Harmanjot Kaur (@itsharmanjot) May 5, 2026
మనశ్శాంతి ముఖ్యం
ఈ వార్తపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ, ‘అసలైన సంపద మీ ఆఫర్ లెటర్‌లో ఉండే అంకెలు కాదు.. మీ సమయం, మీ మనశ్శాంతిపై మీకు ఉండే నియంత్రణ’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ నిచ్చెన ఎక్కే క్రమంలో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అనే చర్చను హర్మన్ జోత్ కథ మరోసారి తెరపైకి తెచ్చింది. కెరీర్ ఎదుగుదల ముఖ్యమే, కానీ అది ఒక బంగారు పంజరం కాకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా?


