బైక్స్‌ కాదు...స్కూటర్లు దూసుకెళ్తున్నాయ్‌    | Sakshi
Sakshi News home page

Electric scooters: బైక్స్‌ కాదు...స్కూటర్లు దూసుకెళ్తున్నాయ్‌   

Published Sat, Sep 3 2022 10:04 AM

Electric scooters sales up by 10pc in Aug 2022 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గతేడాది ఏప్రిల్‌-జూలైలో దేశవ్యాప్తంగా 9,77,986 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 16,87,062 యూనిట్లు నమోదైంది. అంటే 72.5 శాతం అధికం. మోటార్‌సైకిళ్ల వృద్ధి 27 శాతానికే పరిమితమైంది. భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తక్కువ బరువు, సులభంగా నడపడానికి వీలుండడం స్కూటర్ల ప్రత్యేకత. నగరాల్లో అయితే కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గేర్‌లెస్‌ వాహనాలే నయం అన్న భావన ప్రజల్లో ఉంది. స్కూటర్ల డిజైన్, పనితీరు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్ల అమ్మకాలు క్రమంగా అధికం అవుతున్నాయి. 

జోరుగా వృద్ధి నమోదు.. 
కంపెనీనిబట్టి స్కూటర్ల అమ్మకాల్లో 15–437 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మోటార్‌సైకిళ్ల కంటే ఇదే అధికం. ఈ ఏడాది జూలైలో 49.79 శాతం వాటాతో స్కూటర్ల రంగంలో హోండా యాక్టివా రారాజుగా నిలిచింది. చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో రీ ఎంటట్రీ ఇచ్చిన బజాజ్‌ ఆటో 9,261 యూనిట్లతో ఏకంగా 437.49 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2021తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో హోండా మోటార్‌సైకిల్స్, స్కూటర్స్‌ ఇండియా 78.39 శాతం అధికంగా 8,12,086 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 108.14 శాతం వృద్ధితో 4,08,036 యూనిట్లు, సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా 30.3 శాతం దూసుకెళ్లి 2,21,931 యూనిట్లు, హీరో మోటోకార్ప్‌ 15.42 శాతం అధికమై 1,04,885 యూనిట్లు, ఇండియా యమహా మోటార్‌ 60.32 శాతం హెచ్చి 57,525 యూనిట్లను సాధించాయి.  

ఎలక్ట్రిక్‌ స్కూటర్లు సైతం.
క్రమంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఈ–టూవీలర్ల వాటా ఈ ఏడాది జనవరిలో 2.7 శాతం. జూన్‌ నాటికి ఇది 3.8 శాతానికి ఎగసింది. అన్ని కంపెనీలవి కలిపి జనవరిలో 27,590 యూనిట్లు రోడ్డెక్కితే, జూన్‌ నాటికి ఈ సంఖ్య 42,262 యూనిట్లకు చేరింది. జనవరి-జూన్‌లో దేశవ్యాప్తంగా 2,40,662 ఈ-టూవీలర్లు విక్రయం అయ్యాయి. హీరో మోటోకార్ప్‌ పెట్టుబడి చేసిన ఏథర్‌ ఎనర్జీ 2022 ఏప్రిల్‌-జూలైలో 219.48 శాతం వృద్ధిని సాధించింది 13,265 యూనిట్లను విక్రయించింది. ఓకినావా ఆటోటెక్‌ 259 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఓకినావా నుంచి 47,121 యూనిట్లు, హీరో ఎలక్ట్రిక్‌ 44,084, ఓలా 41,994, యాంపీర్‌ ఎలక్ట్రిక్‌ 33,785, ఏథర్‌ 15,952, ప్యూర్‌ ఈవీ 9,531, టీవీఎస్‌ 8,670, రివోల్ట్‌ 8,462, బజాజ్‌ 7,394 యూనిట్లు రోడ్డెక్కాయి.  

జోరుగా ఈ-స్కూటర్ల విక్రయాలు మోటార్‌సైకిళ్లు ఇలా.. 
భారత్‌లో 2021 ఏప్రిల్‌-జూలైలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 25,77,474 యూనిట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో ఈ సంఖ్య 27.07 శాతం వృద్ధితో 32,75,256 యూనిట్లుగా ఉంది. ఈ కాలంలో మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో బజాజ్‌ 5.53 శాతం, సుజుకీ 5.69 శాతం తిరోగమన వృద్ధి చెందాయి. హీరో 29.31 శాతం, హోండా 55.56, టీవీఎస్‌ 13.58, యమహా 67.19, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 41.81 శాతం వృద్ధి నమోదు చేశాయి. కాగా, 2021-22లో భారత్‌లో 1,34,66,412 యూనిట్ల ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2025 నాటికి టూవీలర్స్‌ పరిశ్రమ దేశంలో 2.49 కోట్ల యూనిట్లకు చేరుతుందని అంచనా.    

Advertisement
 
Advertisement
 
Advertisement