క్రికెట్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే.. | Earn Money With Cricket World Cup Match | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే..

Published Sun, Nov 19 2023 11:00 AM | Last Updated on Sun, Nov 19 2023 11:41 AM

Earn Money With Cricket World Cup Match - Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌లో మనం ఎంచుకున్న జట్టే గెలవాలని బలంగా అనుకుంటాం. మైదానంలో క్రీడాకారులు ఆడుతుంటే ఊపిరి బిగబట్టి చూస్తూంటాం. టాస్‌ గెలిచినప్పటి నుంచి మ్యాచ్‌ చివరి బంతి ఆడే వరకు ప్రతిక్షణం ఉత్కంఠభరితంగానే సాగుతుంది. అయితే మనం కోరుకునే జట్టు గెలుపోటములు మాత్రం ఆటగాళ్ల నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్‌ తరుణంలో అందరూ ఆటలోని మజాను ఆస్వాదిస్తుంటారు. అయితే క్రికెట్‌ను చూస్తూ ఆనందించడమే కాకుండా అది మనకు కొన్ని ఆర్థిక పాఠాలూ నేర్పుతుంది. వాటి గురించి ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

ఆటలో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ విజయమే అంతిమ లక్ష్యం. అందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితమైన అంచనాలతో ఆడాల్సిందే. పెట్టుబడులూ అంతే.. ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని చేరుకునేందుకు సరైన ప్రణాళిక లేకపోతే విజయం సాధించడం కష్టం అవుతుంది. 

ఆటగాళ్ల ఎంపిక చాలాముఖ్యం..

జట్టులోని ఆటగాళ్ల సెలక్షన్‌ బాగుంటేనే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అందరూ బ్యాట్స్‌మెన్‌ లేదా బౌలర్లే ఉంటే ఎలా జట్టు గెలుపొందడం కష్టం అవుతుంది. అందుకే వైవిధ్యంగా ఉండాలి. పెట్టుబడుల విషయమూ అంతే. ఒకే తరహా పథకాలు, స్టాక్‌లపై ఆధారపడితే ఎప్పటికీ అనుకున్నది సాధించలేం. షేర్లు, బాండ్లు, ఫండ్లు, బంగారం ఇలా పలు పథకాలు ఎంచుకోవాలి. ఒకే బ్యాట్స్‌మన్‌పై ఎక్కువగా ఆధారపడటమూ మంచిది కాదు. ఈక్విటీల్లో ఏదో ఒక షేరులోనే మొత్తం పెట్టుబడిని కేటాయించడం వల్ల నష్టభయం పెరుగుతుంది.

వికెట్‌ను కాపాడుకోవాలి...

వికెట్‌ను కాపాడుకోవడం.. క్రికెట్‌లో కీలకం. మైదానంలో నిలదొక్కుకుంటేనే బాగుంటుంది. కానీ, పరుగులు తీయకుండా అలాగే కొనసాగడం కూడా నష్టం చేస్తుంది. దాంతో విలువైన బంతులు వృథా అవుతాయి. మొత్తం పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావిస్తూ మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో సాధించేదేమీ ఉండదు. ద్రవ్యోల్బణం రాబడులను హరిస్తుంది. కేవలం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతాలనే నమ్ముకుంటే ఫలితం ఉండదు. రాబడి ఇచ్చే పథకాలు ఎంచుకోవాలి. 

లక్ష్యం మర్చిపోకుండా...

ప్రత్యర్థిజట్టు ముందుగా బ్యాటింగ్‌ చేసి లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. భారీగా ఉండే లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని లక్ష్యం మరిచిపోయి హిట్టింగ్‌ ఎంచుకుని వికెట్‌ పోగుట్టుకుంటారు. చాలామంది మదుపరులు ఇలాంటి పొరపాటే చేస్తారు. ఆర్థిక లక్ష్యం మరిచిపోయి అధిక రాబడులపై ఆశపెంచుకుంటారు. ఫలితంగా ట్రేడింగ్‌ లేదా ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ఆ తొందరపాటులో లాభాలు రాకపోగా పెట్టుబడినీ నష్టపోతారు. లక్ష్యం భారీగా ఉన్నప్పుడు.. క్రమశిక్షణతో ఒక్కో ఓవర్‌కు ఇన్ని పరుగులు అని స్థిరంగా సాధించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. అదే తరహాలో క్రమానుగత పెట్టుబడులను కొనసాగించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. 

  • తొలి ఓవర్లలో సాధ్యమైనన్ని పరుగులు సాధించాలి. సంపాదన ప్రారంభించిన వెంటనే వీలైనంత మదుపు చేసే ప్రయత్నం చేయాలి.
  • ఒక చెత్త ఓవర్‌ ఆటను మలుపు తిప్పుతుంది. ఇదే తరహాలో మీ పెట్టుబడుల్లో పనితీరు బాగాలేని ఒక పథకం ఉంటే.. మొత్తం రాబడిపై ప్రభావం పడుతుంది. అలాంటి పథకాలను గుర్తించి, తొలగించాలి.
  • మైదానంలో ఎన్నో అంశాలు క్రీడాకారుల దృష్టిని మరలుస్తాయి. కానీ, వారి లక్ష్యం మారదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు వచ్చే అవాంతరాలను పట్టించుకోకుండా లక్ష్యం చేరుకునే వరకూ ఓపిక పట్టాలి.
  • లక్ష్యానికి చేరువైనప్పుడు.. దూకుడుగా కాకుండా.. కాస్త నెమ్మదిగా ఆడుతుంటారు. ఇదే తీరుగా అనుకున్న మొత్తం సమకూరినప్పుడు నష్టభయం ఉన్న పథకాల నుంచి సురక్షిత పథకాల్లోకి పెట్టుబడులను మార్చుకోవాలి.
  • జట్టు సభ్యులందరితో కలిసి కోచ్‌ ఒకసారి మ్యాచ్‌ను సమీక్షిస్తారు. ఇలాగే పెట్టుబడులనూ సమీక్షించుకుంటూ ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.

ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement