
అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని భారత ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రారంభించింది. ఇప్పుడున్న సంప్రదాయ డిజైన్‌లోనే మరింత అత్యాధునిక భద్రతను జోడిస్తూ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్, పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (PKI) ఎన్క్రిప్షన్‌తో వీటిని రూపొందించింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం(PSP) వర్షన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని జారీ చేస్తోంది.
ఎక్కడెక్కడ?
ప్రస్తుతం నాగ్‌పూర్, రాయపూర్, భువనేశ్వర్, గోవా, జమ్మూ, అమృత్‌సర్, సిమ్లా, జైపూర్, చెన్నై, సూరత్, హైదరాబాద్, రాంచీ నగరాల్లో ఈ-పాస్‌పోర్ట్‌లను పైలట్ విధానంలో జారీ చేస్తున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే గత మార్చి నెలలో చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వీటి జారీని ప్రారంభించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 2025 మార్చి 22 నాటికి 20,729 ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి.
ఏమిటి ఈ-పాస్‌పోర్ట్ ప్రత్యేకత?
భారతీయ ఈ-పాస్‌పోర్ట్ కవర్లో యాంటెనా, చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్‌ను అనుసంధానం చేస్తారు. పాస్‌పోర్ట్ హోల్డర్ బయోమెట్రిక్, వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ చిప్ ద్వారా మెరుగైన భద్రత, వేగవంతమైన వెరిఫికేషన్ లభిస్తుంది. ఈ-పాస్‌పోర్ట్‌ను దాని ముందు కవర్ కింద ముద్రించిన ప్రత్యేకమైన బంగారు రంగు చిహ్నం ద్వారా గుర్తించవచ్చు. చిప్ లోని సున్నితమైన డేటా దుర్వినియోగం కాకుండా పబ్లిక్ కీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ) ఎన్‌క్రిప్షన్ వ్యవస్థ రక్షిస్తుంది.
తప్పనిసరా?
ప్రస్తుతం ఉన్న పాస్ పోర్టులను ఈ-పాస్‌పార్ట్‌లుగా మార్చుకోవడం తప్పనిసరి కాదు. అవి గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులకు మారడం స్వచ్ఛందం. అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సాంకేతిక ఆధారిత, భద్రత-కేంద్రీకృతంగా మారుతున్న నేపథ్యంలో భారత్ కూడా ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తోంది.
ఈ-పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు ఇలా..
నాగ్‌పూర్, చెన్నై, జైపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో పౌరులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని నిర్దిష్ట పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలులేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల నుండి వీటిని తీసుకోవచ్చు.
🔸 దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి.
🔸 ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఐడీని ఉపయోగించి లాగిన్ కావాలి.
🔸 "అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్/ రీ-ఇష్యూ పాస్‌పోర్ట్" ఆప్షన్ ఎంచుకోండి.
🔸 మీరు కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తుంటే "ఫ్రెష్" ఎంచుకోండి. ఇప్పటికే ఉన్నవారు "రీఇష్యూ" ఎంచుకోండి.
🔸అపాయింట్ మెంట్ తీసుకుని ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.
🔸 అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మీ దరఖాస్తు రసీదును ప్రింట్ లేదా సేవ్ చేయవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ధృవీకరణను సమర్పించవచ్చు.
🔸 నిర్ణీత తేదీలో, మీరు ఎంచుకున్న పాస్‌పార్ట్ కార్యాలయానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లండి.