డాక్టర్‌ రెడ్డీస్‌పై సైబర్‌ దాడి

Dr Reddys Laboratories shuts units after cyber attack - Sakshi

కొన్ని తయారీ కేంద్రాల మూసివేత..!

ప్రభావం లేదని ప్రకటించిన కంపెనీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:   ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యేబొరేటరీస్‌ సైబర్‌ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్‌ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం.

ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ను సంస్థ సమీక్షిస్తోంది.యునైటెడ్‌ స్టేట్స్, యునైటెడ్‌ కింగ్‌డం, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్‌లోని ప్లాంట్లపై ఈ సైబర్‌ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యేబొరేటరీస్‌ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఎటువంటి ప్రభావం లేదు..
సైబర్‌ అటాక్‌ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్‌ సర్వీసులను ఐసోలేట్‌ చేశామని బీఎస్‌ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ముకేశ్‌ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు.

ఔషధ రంగంలో మార్కెట్‌ విలువ పరంగా భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యేబొరేటరీస్‌ రెండవ స్థానంలో ఉంది. సంస్థ దేశంలో 17 తయారీ ప్లాంట్లు, ఆరు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆరు తయారీ ప్లాంట్లు, మూడు ఆర్‌అండ్‌డీ సెంటర్లు ఉన్నాయి.  కాగా, గురువారం డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.46 శాతం (రూ.23.30) తగ్గి రూ.5,023.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.4,832.40కి చేరి తిరిగి పుంజుకుంది.  

సైబర్‌ సెక్యూరిటీకి కంపెనీల ప్రాధాన్యం: సిస్కో
బెంగళూరు: కరోనా వైరస్‌ పరిణామాలతో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానానికి మళ్లుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్‌ సెక్యూరిటీపరమైన సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై కార్పొరేట్‌ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సిస్కో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్‌ మహమ్మారి సమస్యలు ప్రారంభమైనప్పట్నుంచీ సైబర్‌ దాడులు జరగడం లేదా హెచ్చరికలు వచ్చిన ఉదంతాలు 25 శాతం పైగా పెరిగాయని సుమారు 73 శాతం దేశీ సంస్థలు వెల్లడించాయి.

సుమారు మూడింట రెండొంతుల సంస్థలు (65 శాతం) రిమోట్‌ వర్కింగ్‌కు వీలుగా పటిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. ఐటీ రంగంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే 3,000 పైచిలుకు సంస్థలపై సిస్కో ఈ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రిమోట్‌ వర్కింగ్‌ విధానం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయని, క్లౌడ్‌ సెక్యూరిటీపై ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సిస్కో ఇండియా డైరెక్టర్‌ రామన్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top