డాక్టర్‌ రెడ్డీస్‌- జేఎంసీ ప్రాజెక్ట్స్‌‌ జోరు

Dr Reddys lab up for Russian vaccine- JMC zooms on new orders - Sakshi

రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-విపై పరీక్షలకు రెడీ

రెండో రోజూ 4 శాతం జంప్‌చేసిన డాక్టర్‌ రెడ్డీస్‌

దేశ, విదేశాల నుంచి తాజా ప్రాజెక్టులు

8 శాతం లాభపడిన జేఎంసీ ప్రాజెక్ట్స్

కోవిడ్‌-19 కట్టడికి రష్యా రూపొందించిన వ్యాక్సిన్‌పై దేశీయంగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను చేపట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కౌంటర్‌కు రెండో రోజూ డిమాండ్‌ కనిపిస్తోంది. మరోపక్క తాజాగా కాంట్రాక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్
కోవిడ్‌-19 కట్టడికి రిజిస్టరైన రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-విను దేశీయంగా అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో వరుసగా రెండో రోజు డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్‌ కౌంటర్‌ వెలుగులో నిలుస్తోంది. ఎన్‌ఎస్ఈలో  తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 4,773ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 4,767 వద్ద ట్రేడవుతోంది. స్పుత్నిక్‌-విపై దేశీయంగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీలను డాక్టర్‌ రెడ్డీస్‌కు ఆర్‌డీఐఎఫ్‌ అందించనుంది. గమేలియా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో రూపొందించిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-విపై రష్యాలో రెండు దశల పరీక్షలను నిర్వహించారు. వీటిలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని, సమర్థవంతంగా పనిచేస్తున్నదని ఆర్‌డీఐఎఫ్‌ ఇప్పటికే తెలియజేసింది.

జేఎంసీ ప్రాజెక్ట్స్‌
దేశ, విదేశాల నుంచి రూ. 1,342 కోట్ల విలువైన కాంట్రాక్టులు తాజాగా లభించినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్‌ తెలియజేసింది. వీటిలో తూర్పు ఆసియా నుంచి దక్కించుకున్న రూ. 725 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ ఉన్నట్లు పేర్కొంది. ఈ బాటలో ఒడిషాలో నీటిపారుదల సౌకర్యాల కల్పనకు రూ. 471 కోట్ల ప్రాజెక్ట్‌ లభించగా.. బిల్డింగ్‌ నిర్మాణం కోసం రూ. 146 కోట్ల కాంట్రాక్టును ఉత్తరాది నుంచి పొందినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో జేఎంసీ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 8 శాతంపైగా జంప్‌చేసి రూ. 57.40ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం ఎగసి రూ. 55.40 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top