విదేశీ చేతుల్లోకి ఎల్‌ఐసీ! కేంద్రం కసరత్తు

DPIIT Revising FDI Policy To Facilitate LIC - Sakshi

ఎల్‌ఐసీలో విదేశీ పెట్టుబడులు!

ఎఫ్‌డీఐ విధానాల సవరణ 

ఐపీఓకి వీలుగా నిబంధనల మార్పు  

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి వీలుగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. తాజాగా వాణిజ్యం, పరిశ్రమల శాఖ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) విధానాల సవరణకు నడుం బిగించింది. ఆర్థిక శాఖ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తదుపరి ఇందుకు తగిన మార్పులను చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

డిజిన్వెస్ట్‌మెంట్‌కి అనుకూలం కాదని
బీమా రంగానికి చెందిన ప్రస్తుత విధానాలు ఎల్‌ఐసీ డిజిన్వెస్ట్‌మెంట్‌కు అనుమతించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ తెలియజేశారు. దీంతో మార్గదర్శకాలను సవరించవలసి ఉన్నదని వివరించారు. వెరసి ఎఫ్‌డీఐ విధానాలు మరింత సరళీకరిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా సవరించిన విధానాలను ప్రకటించనున్నట్లు తెలియజేశారు. ఈ అంశాలపై ఆర్థిక సర్వీసుల విభాగం, దీపమ్‌ చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. డీపీఐఐటీ, డీఎఫ్‌ఎస్, దీపమ్‌ మధ్య చర్చలతో అవసరమైన సవరణలను రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. తదుపరి క్యాబినెట్‌ అనుమతికి నివేదించనున్నట్లు వెల్లడించారు. 

74 శాతం
ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానాలు బీమా రంగంలో ఆటోమాటిక్‌ మార్గం ద్వారా 74% విదేశీ పెట్టుబడులను అనుమతిస్తాయి. అయితే ప్రత్యేక చట్టంలో భాగమైన ఎల్‌ఐసీకి ఇవి వర్తించవు. సెబీ నిబంధనల ప్రకారం ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐలను పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా అనుమతిస్తారు. ఎల్‌ఐసీ ప్రత్యేక చట్టంలో విదేశీ పెట్టుబడులకు అవకాశంలేదు. దీంతో విధానాలలో మార్పులు చేపట్టవలసి ఉన్నట్లు అధికారిక వర్గాలు వివరించాయి. గతేడాది జులైలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు క్యాబినెట్‌ ఆమోదించడం తెలిసిందే. మార్చిలోగా ఐపీవోను పూర్తిచేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top