
జూన్‌లో 1.36 కోట్ల ప్యాసింజర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సంస్థలు ఈ ఏడాది జూన్‌లో 1.36 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. మే నెలలో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో దేశీ ఎయిర్‌లైన్స్‌లో 8.51 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 7.93 కోట్ల మంది ప్యాసింజర్లతో పోలిస్తే ఇది 7.34 శాతం అధికం.
ఫ్లయిట్ల జాప్యాల వల్ల 1,20,023 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఫ్లయిట్ల రద్దు వల్ల 33,333 ప్రయాణికులపై ప్రభావం పడగా, పరిహారం, ఇతరత్రా సదుపాయాల కల్పన కింద విమానయాన సంస్థలు రూ. 72.40 లక్షలు వెచ్చించాయి. ఇక, మే నెలలో 64.6 శాతంగా ఉన్న విమానయాన సంస్థ ఇండిగో మార్కెట్ వాటా జూన్‌లో 64.5 శాతానికి పరిమితమైంది. ఎయిరిండియా గ్రూప్ వాటా 26.5 శాతం నుంచి 27.1 శాతానికి చేరింది. ఆకాశ ఎయిర్ వాటా పెద్దగా మార్పు లేకుండా 5.3 శాతం స్థాయిలోనే ఉంది. స్పైస్‌జెట్ వాటా మాత్రం 2.4 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది.