డిజిటలైజేషన్‌తో స్పీడ్‌: జుకర్‌బర్గ్‌, ముకేశ్‌

Digitalise India can grow with speed: Zuckerberg- Mukesh  - Sakshi

ఫేస్‌బుక్‌ నిర్వహణలో ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా 2020 సదస్సు షురూ

డిజిటల్‌ విభాగంలో అవకాశాలు, ప్రభావంపై రెండు రోజులపాటు చర్చలు

వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో భాగంగా ముకేశ్‌ అంబానీ, జుకర్‌బర్గ్‌ ప్రసంగం

ముంబై, సాక్షి: ఫ్యూయల్ ఫర్‌ ఇండియా2020పేరుతో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నిర్వహిస్తున్న తొలి ఎడిషన్‌ నేడు ప్రారంభమైంది. వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభమైన సదస్సులో భాగంగా ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రసంగించారు. దేశీయంగా డిజిటల్‌ విభాగంలో గల అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్‌ ప్రభావం తదితర పలు అంశాలను ప్రస్తావించారు. సదస్సులో ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్‌ శాండ్‌బర్గ్‌‌, ఫేస్‌బుక్‌ ఇండియా ఎండీ అజిత్‌ మోహన్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ అధికారులు సైతం ప్రసంగించనున్నారు. ఇదేవిధంగా రిలయన్స్‌ జియో తరఫున డైరెక్టర్లు ఆకాశ్‌ అంబానీ, ఈషా అంబానీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. కాగా.. డిజిటలైజేషన్‌లో దేశాన్ని ప్రధాని మోడీ ముందుండి నడిపిస్తున్నట్లు జుకర్‌బర్గ్‌, ముకేశ్‌ అంబానీ ప్రశంసించారు. వివరాలు చూద్దాం.. (5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి)

మార్క్‌ జుకర్‌బర్గ్‌:
భారత్‌లో ప్రస్తావించదగ్గ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సంస్క్రతి నెలకొని ఉంది. ప్రధాని మోడీ డిజిటల్‌ ఇండియా విజన్‌ కారణంగా పలు అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వంతో భాగస్వామ్యానికి పరిశ్రమకు వీలు చిక్కనుంది. టెక్నాలజీ ద్వారా అభివృద్ధి వేగమందుకోనుంది. ప్రభుత్వం సృష్టించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రజలకెంతో మేలు చేస్తోంది. డిజిటల్‌ టూల్స్‌ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభించనుంది. దేశీయంగా కోట్ల కొద్దీ ప్రజలకు ఇంటర్నెట్ ప్రయోజనాలను అందించడంలో రిలయన్స్‌ జియో కీలకంగా మారింది. మరోపక్క వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌కు దారి ఏర్పడుతోంది. దేశీ వినియోగదారులకు భద్రతతో కూడిన స్వేచ్చా ఇంటర్నెట్‌కు ఫేస్‌బుక్‌ వేదికగా నిలుస్తోంది. (ముకేశ్‌ కుంటుంబం ఆసియాలోకెల్లా సంపన్నం)

ముకేశ్‌ అంబానీ:
రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ పెట్టుబడుల కారణంగా జియోకు లబ్ది చేకూరుతోంది. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలయన్స్‌ జియోలో 9.9 శాతం వాటాను రూ. 43,754 కోట్లకు ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. దేశంలో రిలయన్స్‌ జియో డిజిటల్‌ కనెక్టివిటీకి తెరతీసింది. మరోవైపు వాట్సాప్‌ నౌ ద్వారా వాట్సాప్‌ డిజిటల్‌ ఇంటరేక్టివిటీని కల్పిస్తోంది. ఇక రిటైల్‌ రంగంలో జియో మార్ట్‌ అటు ఆన్‌లైన్‌, ఇటు ఆఫ్‌లైన్‌లో అపార అవకాశాలకు చోటిస్తోంది. దీంతో గ్రామాలు, చిన్న పట్టణాలలోగల చిన్న షాపులకూ డిజిటలైజేషన్‌ ద్వారా బిజినెస్‌ అవకాశాలకు దారి ఏర్పడుతోంది. విద్య, ఆరోగ్య రంగాలలోనూ డిజిటల్‌ అవకాశాలకు కొదవలేదు. డిజిటల్‌ సోసైటీగా మారాక రానున్న రెండు దశాబ్దాలలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్‌-3లో ఒకటిగా ఆవిర్భవించే వీలుంది. యువశక్తి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది. దీంతో తలసరి ఆదాయం ప్రస్తుత 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పుంజుకునే అవకాశముంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top