ధరలు పోల్చుకోవడాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం నిర్ణయం
లీగల్ మెట్రాలజీ నిబంధనల్లో మార్పులు
తొమ్మిది రకాల పరిమాణాల్లోనే ప్యాకింగ్
పరిశ్రమ వర్గాలకు మూడు నెలల గడువు
న్యూఢిల్లీ: వంట నూనెల విక్రయాల్లో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ప్యాకెట్లను ఇకపై నిర్దిష్ట ప్రామాణిక కొలతల్లోనే విక్రయించాలని నిబంధన తెచ్చింది. దీంతో వినియోగదారులు ఏ బ్రాండ్ నూనె తక్కువ ధరకు వస్తుందో సులభంగా పోల్చి చూసుకోవచ్చు. అందుకు అనుగుణంగా ‘లీగల్ మెట్రాలజీ’ నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలను అమలు చేసేందుకు తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు ప్రభుత్వం మూడు నెలల గడువు ఇచి్చంది.
తొమ్మిది ప్రామాణిక కొలతల్లోనే ప్యాకింగ్ ..
సవరించిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్‌ఓపీ) ప్రకారం దేశంలోని ప్రధాన వంట నూనెలకు 200 మి.లీ./గ్రా., 500 మి.లీ./గ్రా., ఒక లీటర్/కిలో, రెండు లీటర్లు/కిలోలు, మూడు లీటర్లు/కిలోలు, నాలుగు లీటర్లు/కిలోలు, 5 లీటర్లు/కిలోలు, 15 లీటర్లు/కిలోలు, 20 లీటర్లు/కిలోల ప్రామాణిక ప్యాకేజింగ్ పరిమాణాలను నిర్ణయించింది. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆవనూనె, వేరుశనగ, నువ్వులు, రైస్‌బ్రాన్, పత్తిగింజలు, మొక్కజొన్న నూనెలతో పాటు మిశ్రమ వంట నూనెలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. దేశీయంగా తయారయ్యే, విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంట నూనెలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది.
పరిమాణంతో పాటు ‘బరువు’ కూడా చెప్పాల్సిందే ..
ప్యాకెట్లపై నూనె పరిమాణాన్ని మిల్లీలీటర్లు లేదా లీటర్లలో చూపినట్లయితే, దానికి సమానమైన బరువును కూడా గ్రాములు లేదా కిలోగ్రాములలో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే 200 మి.లీటర్లు లేదా 200 గ్రాముల కంటే చిన్న ప్యాకెట్లకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. అలాగే తక్కువగా వాడే కొన్ని రకాల నూనెలకు కూడా ఈ కొత్త రూల్స్ వర్తించవు. గడువు పూర్తికాకముందే ఈ విధానాన్ని అమలు చేయాలనుకునే సంస్థలు వెంటనే అమలు చేయవచ్చని కేంద్రం పేర్కొంది.
మార్కెట్‌లో గందరగోళానికి తెర: ఐవీపీఏ
కేంద్ర నిర్ణయాన్ని ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ స్వాగతించారు. ‘‘ఈ చర్యతో రిటైల్ మార్కెట్‌లో క్రమబద్ధత ఏర్పడటంతో పాటు పోటీలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ప్రామాణికతను తొలగించారు. అయితే మూడేళ్లుగా భిన్న పరిమాణాల ప్యాకెట్ల విస్తరణతో మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. తాజా నిర్ణయంతో వినియోగదారుల్లో ఏర్పడిన అయోమయం తొలగిపోతుంది’’ అని సుధాకర్ అన్నారు.


