బాదుడే.. బాదుడు.. 'ధరలు కొండెక్కి.. బతుకు బరువెక్కి'! | Chandrababu Govt failed to bring Essential commodities Prices under control | Sakshi
Sakshi News home page

బాదుడే.. బాదుడు.. 'ధరలు కొండెక్కి.. బతుకు బరువెక్కి'!

May 21 2026 4:52 AM | Updated on May 21 2026 5:22 AM

Chandrababu Govt failed to bring Essential commodities Prices under control

విలవిల్లాడుతున్న సామాన్యుడు నిత్యావసర సరుకులపై డీజిల్‌ ధరల పెంపు ప్రభావం

ఠారెత్తిస్తున్న వంటనూనె ధరలు.. చుక్కలనంటిన కూరగాయల ధరలు.. ఎగబాకుతున్న బియ్యం, పప్పుల ధరలు 

గతేడాదితో కాదు.. గత నెలతో పోల్చినా పెరిగిన ధరలు 

అదుపు చేయడంలో విఫలమైన చంద్రబాబు సర్కారు

చమురు ధరలను నియంత్రిస్తానని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ.. ఇక లోకేశ్‌ అయితే పెట్రోల్‌ బంకుల ముందు నిల్చుని మరీ సెల్ఫీ చాలెంజ్‌లు

డీజిల్‌ ధరల పెంపు నిత్యావసర సరుకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పెరిగిన పెట్రో ధరలు నిత్యావసరాల రూపంలో ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. వంట నూనెల నుంచి బియ్యం, పప్పుల వరకు ఏ ధర చూసినా కొండెక్కి కూర్చున్నాయి. ఈ తరుణంలో ‘గుక్కెడు గంజీ కరువైపోయె.. బక్కటి ప్రాణం బరువైపోయె’ అన్నట్టుగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్యుల నెత్తిన నిప్పుల కుంపటిగా మారాయి. వంట నూనెలు, బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు రోజురోజుకు ఎగబాకుతుండటంతో బడుగు జీవుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. డీజిల్‌ ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పత్తా లేకుండాపోయింది. కనీసం నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేసే దిశగా ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. డీజిల్‌ ధరల పెంపు కారణంగా అన్నిరకాల నిత్యావసరాల ధరలు 15నుంచి 40 శాతం మేర పెరిగాయి. వంట నూనె ధరలైతే లీటర్‌కు రూ.200 పైగా ఎగబాకాయి. కూరగాయల ధరలు ఏది చూసినా కిలో రూ.50–రూ.60 దాటిపోయాయి. పప్పుల ధరలు సైతం 20–30 శాతం మేర పెరిగాయి. ధరల బాదుడికి సామాన్య ప్రజానీకం కుదేలవుతుంటే.. గ్యాస్, పెట్రోల్‌ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు అధికార పీఠమెక్కిన తర్వాత గ్యాస్‌ ధరలను దాదాపు మూడుసార్లు పెంచడం పేదలకు పెనుభారంగా మారింది. రోజువారీ పనులు లేకపోవడంతో పేదల చేతిలో చిల్లిగవ్వ లేక, పెరిగిన ధరలకు నిత్యావసర సరుకులు కొనలేని దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

నూనె ధరలు సలసలా 
రాష్ట్రంలో వంట నూనె ధరలు సెగ పుట్టిస్తున్నాయి. పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరుశనగ నూనె ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. గతంలో ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో నూనె ధరలు పెరగ్గా.. తాజాగా డీజిల్‌ ధరల పెంపు ప్రభావంతో మరోసారి ఎగబాకాయి. పామాయిల్‌పై 60 శాతం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై 70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం ధరలు పెరిగాయి. వీటితో పాటు ఆవనూనె, సోయ, వనస్పతి రేట్లు కూడా పెరిగిపోయాయి. 2024 మేలో వేరుశనగ నూనె ధర రూ.168 ఉండగా.. ప్రస్తుతం రూ.210కు చేరింది. లీటరు పామాయిల్‌ రూ.89 ఉంటే.. ఇప్పుడు రూ.160 పలుకుతోంది. సన్‌ఫ్లవర్‌ రిఫైండ్‌ ఆయిల్‌ రూ.112 ఉంటే.. ఇప్పుడు రూ.175–185 పలుకుతోంది.  


పప్పులు.. ధరల నిప్పులు 
పప్పుల ధరలు సైతం పోటీపడి పెరుగుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా.. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చినా ఏపీలో పప్పుల ధరలు అధికంగా ఉంటున్నాయి. గత నెలతో పోలిస్తే వీటి ధరలు 15–30 శాతం పెరిగాయి. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.148–155, గోధుమ పిండి రూ.71–90, మినప్పప్పు రూ.164–170కి పైగా ధరలు పలుకుతున్నాయి. పెసలు సైతం రూ.165–175, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగలు రూ.210కి తక్కువగా లేవు. పచి్చశనగపప్పు ఏకంగా కిలో రూ.280–300 పలుకుతోంది. గోధుమలు కిలో రూ.35–40, గోధుమ పిండి కిలో రూ.40–43, కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే ఎండుమిర్చి రూ.390–420, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.220–250, అల్లం రూ.115–150, కారం రూ.520 (ప్రీమియం), సాధారణం రూ.220పైగా ధరలు పలుకుతున్నాయి. టమాటా కిలో రూ.65 పలుకుతోంది. అరటి సైతం రైతుకు కిలోకు రూ.5 దక్కుతుంటే.. బయట మాత్రం డజను రూ.100 పైమాటే.  చివరకు కరివేపాకు సైతం కేజీ రూ.200గా ఉంది. పచ్చిమిర్చి రూ.80, క్యాప్సికం రూ.80, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు.   


‘బియ్యం’ ధరదడ 
మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బియ్యం ధరలు 15 రోజుల్లో పెరిగాయి. హోల్‌సేల్‌లో 26 కేజీల బస్తాపై రూ.50 పెరిగితే.. రిటైల్‌ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.120 మేర పెరిగాయి. కిలో రూ.45 నుంచి రూ.70 పలుకుతున్నాయి. 15 రోజుల క్రితం 26 కిలోల   సాధారణ బ్రాండ్‌లకు చెందిన సన్న బియ్యం బస్తా రూ.1,300–1,400 ఉంటే ఇప్పుడు రూ.1,650 చేరింది. ప్రీమియం రకాలైతే 26 కిలోల బస్తా రూ.1,599 నుంచి రూ.1,810 వరకు పలుకుతున్నాయి. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.­150 పైమాటే. దావత్‌ బియ్యమైతే కిలో రూ.230–­250 వరకు పలుకుతున్నాయి. వాస్తవానికి గడచిన నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్‌ సన్నరకాల బి­య్యంపై రేట్లు పెంచేశాయి. క్వింటాకు ఏకంగా రూ.400­పైనే వడ్డించాయి. ఇలా ఇష్టానుసారం బియ్యం ధరలు పెంచేస్తుంటే నియంత్రించాల్సిన చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. రూ.10–15కు దొరికే కొత్తిమీర కట్ట ధర సైతం సైజును బట్టి రూ.25–30 పలుకుతోంది. మూడు కట్టలు రూ.10కు దొరికే ఆకు కూర ఏదైనా ఇప్పుడు రూ.25–30 తక్కువకు దొరకడం లేదు. గతంలో 200 పెడితే బ్యాగ్‌ నిండా వచ్చే కూరగాయలు ప్రస్తుతం రూ.500 పెట్టినా సంచి సగం రావడం లేదు.

కొనలేకపోతున్నాం  
ప్రభుత్వం పెట్రోల్, డీ­జిల్‌ ధరలు పెంచ­డంతో ఆ ప్రభా­వం ని­త్యావసర సరు­కుల­పై పడుతోంది. సామాన్యులు బయట బజార్‌లో ఏమీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాం. 
– ఎస్‌.ఈశ్వరి, గృహిణి, కొండపల్లి, ఎన్టీఆర్‌ జిల్లా   

బతుకు దుర్భరమైంది 
20 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. ఉచిత బస్సువల్ల బేరాలు లేక  ఇప్పటికే ఇ­బ్బందులు పడుతున్నాం. ఫ్రీ బస్సు లేనప్పుడు రోజు­కు రూ.500 వచ్చేది. ఇప్పుడు రెండొందలు కూడా రావడం లేదు. తాజాగా డీజిల్‌ ధరలు పెంచడం వల్ల నిర్వహణ ఖర్చులతో
పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇలా అయితే ఎలా బతుకుతాం.  
– బందం రమేష్, ఆటోడ్రైవర్, దేవవరం, నక్కపల్లి మండలం, అనకాపల్లి

ఎలా బతకాలి! 
డీజిల్, పెట్రోల్‌ ధరలు పెంచడంతో నిత్యావ­సర సరుకుల ధరలు పెంచేశారు. ఏం కొందా­మన్నా ధరలు మండిపోతున్నాయి. ప్రతీ వస్తువుపై రూ.5 పెంచేశారు. ఇదేంటని అడిగితే డీజిల్‌ ధరలు పెంచారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎలా బతకాలి. సామాన్యులకు దాపురించిన ఆ పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. 
– జమ్రుత్‌బాషా, సీటీఎం మదనపల్లె

పచ్చడి మెతుకులే దిక్కు 
సామాన్యులే కాకుండా మధ్యతరగతి జనం కూడా ఈ ధరల కారణంగా పచ్చడి మెతుకులకే పరిమితం కావాల్సి వస్తోంది. కందిపప్పు, వంటనూనె ధరలు కూడా అందుబాటులో లేవు. కూరగాయలతోపాటు అన్నిరకాల సరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనంతటికీ కారణం ప్రభుత్వ వైఫల్యమే. 
– కుప్పిలి జానకమ్మ, గృహిణి, విద్యానగర్, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా  

ఇంటిని నడపడం కష్టంగా మారింది  
ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇంటిని నడపడం కష్టంగా మారింది. కూరగాయలు, పప్పులు, నూనెలు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడంతో బతుకు భారంగా మారింది. ఒకప్పుడు నెలకు రూ.5 వేలు ఖర్చు పెడితే సరిపోయేది. ఇప్పుడు రూ.10 వేలయినా చాలడం లేదు. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 
– షేక్‌ హుసేన్‌బీ, గృహిణి, లింగాపురం 

ప్రభుత్వం చోద్యం చూస్తోంది 
ధరలకు కళ్లెం వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర సరుకులైన వంటనూనె, పప్పులు, కూరగాయలు, చికెన్‌ ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల ధరలు కట్టు తెగాయి. ఈ ధరల్ని తట్టుకోవడం మాలాంటి వారికి చాలా కష్టంతో కూడుకున్న పని.  
– జి.లక్ష్మీనారాయణ, వీధి వ్యాపారి, రేఖవానిపాలెం, విశాఖపట్నం  

Advertisement
 
Advertisement
Advertisement