డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా | Sakshi
Sakshi News home page

డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా

Published Thu, Sep 21 2023 9:39 AM

Data protection Act Govt to discuss transition and fine may go up to 250 crores - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రత చట్ట నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్స్‌ను సరిచేసు కునేందుకు వ్యాపార సంస్థలకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇది సుమారు ఏడాది పాటు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలతో సమావేశం సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు.

డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్‌ అథారిటీ అయిన డేటా ప్రొటెక్షన్‌ బోర్డు (డీపీబీ)ని వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు  టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు.  డేటా భద్రత బోర్డుతో పాటు మార్గదర్శకాలు మొదలైనవన్నీ నెల రోజుల్లోగా సిద్ధం కాగలవని మంత్రి తెలిపారు. మెటా, లెనొవొ, డెల్, నెట్‌ఫ్లిక్స్‌ సహా పలు కంపెనీలకు చెందిన 125 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల వ్యక్తిగత డేటాను ఆన్‌లైన్‌ వేదికలు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే దిశగా డేటా భద్రత చట్టాన్ని రూపొందించారు.

దీనికవసరమైన 25 నియమాలలో చాలా వరకు ముసాయిదా రూపొందించబడి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. సమ్మతి ఆధారిత యంత్రాంగం ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం కంపెనీలకు చట్టం తప్పనిసరి చేసింది, అయితే కొన్ని చట్టబద్ధమైన ఉపయోగాల కోసం, చట్టం కొన్ని సడలింపులను అందిస్తుంది.   అమల్లో విఫలమైన సంస్థలకు రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి.  అంతేకాదు 500 కోట్లకు పెంచవచ్చని కూడా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement