దేశంలో దిగ్గజ కంపెనీల పెట్టుబడుల సునామీ..!

Data Center Capacity In India To See Investments Of Rs 1.20 Lakh Crore - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందుతోంది. దేశ, విదేశ సంస్థలు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఈ విభాగంలోకి దాదాపు రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది.

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ఐబీఎం, ఉబర్, డ్రాప్‌బాక్స్‌ మొదలైన బడా సంస్థలు తమ డేటా స్టోరేజీని థర్డ్‌ పార్టీ డేటా సెంటర్‌ ప్రొవైడర్లకు అవుట్‌సోర్సింగ్‌ చేస్తున్నాయని వివరించింది. హీరనందానీ గ్రూప్, అదానీ గ్రూప్‌ లాంటి దేశీ కార్పొరేట్‌ దిగ్గజాలతో పాటు అమెజాన్, ఎడ్జ్‌కనెక్స్, మైక్రోసాఫ్ట్, క్యాపిటలాండ్, మంత్ర గ్రూప్‌ వంటి విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారతీయ డేటా సెంటర్లలో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించాయి.

‘వాటితో పాటు ఎన్‌టీటీ, కంట్రోల్‌ఎస్, ఎన్‌ఎక్స్‌ట్రా, ఎస్‌టీటీ ఇండియా మొదలైనవి తమ సామర్థ్యాలను మరింతగా పెంచుకుంటున్నాయి. మొత్తం మీద రాబోయే అయిదేళ్లలో 3900–4100 మెగావాట్ల సామర్థ్యం సాధించేందుకు సుమారు 1.05–1.20 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది‘ అని ఇక్రా తెలిపింది. 

ఆదాయాల వృద్ధి.. 
2022–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో పరిశ్రమ ఆదాయాలు వార్షికంగా 18–19 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. ర్యాక్‌ సామర్థ్యాల వినియోగం పెంచుకోవడం, కొత్త డేటా సెంటర్ల విస్తరణ ఇందుకు దోహదపడనున్నాయి. ఆదాయాలు పెరగడం, స్థిర వ్యయాలను తగ్గించుకోగలగడం వంటి అంశాల ఊతంతో డేటా సెంటర్‌ కంపెనీల నిర్వహణ మార్జిన్లు మెరుగుపడవచ్చని ఇక్రా పేర్కొంది. 

40–42 శాతం శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది. ‘నియంత్రణ విధానాలపరంగా తోడ్పాటు, భారీగా పెరుగుతున్న క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ వినియోగం, డిజిటల్‌ ఎకానమీపై .. కొత్త టెక్నాలజీలపై (ఐవోటీ, 5జీ మొదలైనవి) ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుండటం వంటి అంశాలు దేశీయంగా డేటా సెంటర్ల డిమాండ్‌కు తోడ్పడగలవు‘ అని ఇక్రా కార్పొరేట్‌ రేటింగ్స్‌ గ్రూప్‌ హెడ్‌ రాజేశ్వర్‌ బర్ల తెలిపారు.

 2022–23 బడ్జెట్‌లో డేటా సెంటర్లకు కేంద్రం ఇన్‌ఫ్రా రంగ హోదా కల్పించింది. తక్కువ వడ్డీ రేట్లపై దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు, నిర్దిష్ట మార్గాల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు ఇది వాటికి ఉపయోగపడుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top