భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌..కోట్ల సంపద కోల్పోతున్న ఇన్వెస్టర్లు | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌..కోట్ల సంపద కోల్పోతున్న ఇన్వెస్టర్లు

Published Mon, Jun 13 2022 9:35 AM

Daily Stock Market Update In Telugu June 13 - Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు స్టాక్‌మార్కెట్‌ను కలవర పెడుతున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు వివిధ దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు స్టాక్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. 

ఈరోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. ఆ తర్వాత కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం 9:30 గంటల సమయంలో 1459 పాయింట్లు నష్టపోయి 2.46 శాతం క్షీణించి 52,843 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 396 పాయింట్లు నష్టపోయి 15,805 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. బ్లాక్‌మండే ఎఫెక్ట్‌తో మార్కట్‌ ఆరంభమైన అరగంటలోనే సెన్సెక్స్‌ 53 వేల దిగువకు పడిపోగా నిఫ్టీ 16వేల కిందకు పడిపోయింది. లార్జ్‌, స్మాల్‌, మిడ్‌ అన్ని రంగాల్లో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్‌మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారను. గడిచిన పది రోజుల్లో ఏకంగా 14 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. డిపాజిటరీ గణాంకాల ప్రకారం జూ 1 నుంచి 10 మధ్యలో ఏకంగా రూ.13,888 కోట్ల నగదు మార్కెట్‌ నుంచి బయటకు వెళ్లింది. అయితే దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌లోకి రావడం కొంత ఊరట కలిగించింది. అయితే సోమవారం కూడా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహారణ బాటలోనే ఉండటం ఒకింత ఆందోళన కలిగించే అంశంగా మారింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement