Cyrus Mistry: మిస్త్రీ కారు నడిపిన లేడీ డాక్టర్‌..‘నా కళ్లెదురుగా ప్రమాదం ఎలా జరిగిందంటే!..’

Cyrus Mistry Killed In Road Accident Latest Updates - Sakshi

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మిస్త్రీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశీయ వ్యాపార దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన రోడ్డు ప్రమాదంపై పాల్ఘర్‌ జిల్లా పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

రోడ్డు పక్కనే ఓ గ్యారేజీలో పనిచేస్తున్న వ్యక్తి సైరస్‌ మిస్త్రీ కారు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ‘నా కళ్లెదురుగా ఓ మహిళ అతివేగంతో మిస్త్రీ కారును నడుపుతుంది. ఎడమ నుంచి మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసేందుకు  ఆమె ప్రయత్నించారు. ఆ సమయంలో డ్రైవింగ్‌ సీట్లో ఉన్న మహిళ వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌కు ఢీకొట్టారు’ అని అతను వెల్లడించాడు.

ఎవరీ అనిహిత పండోలే 
సైరస్‌ మిస్త్రీ తన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో గుజరాత్‌ ఉడవాడ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్నారు. అదే కారులో మిస్త్రీతో పాటు ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌ అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్‌ పండోలే.. డారియస్‌ పండోలే సోదరుడు జహంగీర్‌ పండోలేలు కూడా ఉన్నారు.

అనిహిత పండోలే కారు నడుపుతుండగా.. పక్క సీట్లో ఆమె భర్త డారియస్‌ పండోలే కూర్చుకున్నారు. వెనక సీట్లలో సైరస్‌ మిస్త్రీ ఆయన పక్కన జహంగీర్‌ పండోలేలు ఉన్నారు. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం మహరాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో సూర్య నది వంతెనపై మిస్త్రీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. 

ప్రమాద సమయంలో కారు సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడంతో ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కాలేదు. దీంతో సైరస్‌ మిస్త్రీ ఆయన పక్కనే ఉన్న జహంగీర్‌ పండోలేలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్‌ పండోలే తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు దర్యాప్తు ముమ్మరం
మిస్త్రీ కారుప్రమాదానికి గల కారణాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా చరోటీ నాకా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. కారులో ఏదైనా మెకానికల్ సమస్యలు ఉన్నాయా అని నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఆ కారులో బ్లాక్‌ బాక్స్‌ తరహాలో అసెంబుల్ చేసిన చిప్ నుండి డేటాను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
చదవండి👉 టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కన్నుమూత

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top