
మెగా ఐపీఓ ధరల శ్రేణి ప్రకటించిన కంపెనీ
ఈ నెల 6 నుంచి 8 వరకు పబ్లిక్ ఆఫర్
రూ. 15,512 కోట్ల సమీకరణపై కన్ను
ముంబై: టాటా క్యాపిటల్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు రూ.310–326 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 6న మొదలై 8న ముగుస్తుంది. జూలైలో చేపట్టిన రైట్స్ ఇష్యూతో పోలిస్తే ఐపీఓ షేరు ధర 5 శాతం తక్కువేనని, విస్తృత స్థాయిలో భాగస్వామ్యంతో పాటు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే దీని లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా టాటా క్యాపిటల్ షేరుకు రూ.343 చొప్పున రూ.1,750 కోట్లు సమీకరించింది.
అతి పెద్ద ఇష్యూ...
ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మార్కెట్ విలువ రూ.1.38 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా. దీంతో ఈ ఏడాది మన స్టాక్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలుస్తుంది. ఇష్యూలో భాగంగా టాటా సన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) 3.58 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. కంపెనీ 21 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేస్తోంది.
కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్‌కు 88.6%, ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా నిలుస్తున్న టాటా క్యాపిటల్ లోన్ బుక్ రూ.2.3 లక్షల కోట్ల పైమాటే. ఇందులో 88 శాతం రుణాలు రిటైల్ ఖాతాదారులు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) ఇచి్చనవే కావడం గమనార్హం. 2023లో నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ అరంగేట్రం తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న మరో భారీ ఐపీఓ కానుంది.