breaking news
Rajiv Sabharwal
-
టాటా క్యాపిటల్ @ రూ.310–326
ముంబై: టాటా క్యాపిటల్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు రూ.310–326 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 6న మొదలై 8న ముగుస్తుంది. జూలైలో చేపట్టిన రైట్స్ ఇష్యూతో పోలిస్తే ఐపీఓ షేరు ధర 5 శాతం తక్కువేనని, విస్తృత స్థాయిలో భాగస్వామ్యంతో పాటు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే దీని లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా టాటా క్యాపిటల్ షేరుకు రూ.343 చొప్పున రూ.1,750 కోట్లు సమీకరించింది. అతి పెద్ద ఇష్యూ... ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మార్కెట్ విలువ రూ.1.38 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా. దీంతో ఈ ఏడాది మన స్టాక్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలుస్తుంది. ఇష్యూలో భాగంగా టాటా సన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) 3.58 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. కంపెనీ 21 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేస్తోంది. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్‌కు 88.6%, ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా నిలుస్తున్న టాటా క్యాపిటల్ లోన్ బుక్ రూ.2.3 లక్షల కోట్ల పైమాటే. ఇందులో 88 శాతం రుణాలు రిటైల్ ఖాతాదారులు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచి్చనవే కావడం గమనార్హం. 2023లో నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ అరంగేట్రం తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న మరో భారీ ఐపీఓ కానుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ ట్రాన్స్పరెంట్ క్రెడిట్ కార్డ్
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ భారత్‌లోనే తొలి పారదర్శక డిజైన్‌తో కూడిన క్రెడిట్ కార్డ్‌ను అందిస్తోంది. జెమ్‌స్టోన్ కలక్షన్లో భాగంగా ఈ పారదర్శక క్రెడిట్ కార్డును అమెరికన్ ఎక్స్‌ప్రెస్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తెస్తున్నామని ఐసీఐసీ బ్యాంక్ ఈడీ రాజీవ్ సభర్వాల్ చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ పేరుతో అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలపై బోనస్ రివార్డ్ పాయింట్లు పొందవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా పొడిగించబడిన క్రెడిట్ పీరియడ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నామని వివరించారు. ప్రముఖ రెస్టారెంట్లలో బిల్లులపై కనీసం 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చని, హెచ్‌పీసీఎల్ అవుట్లెట్లలో ఇంధన కొనుగోళ్లపై ఎలాంటి సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సాధారణంగా ప్లాస్టిక్ క్రెడిట్ కార్డులు పారదర్శకంగా ఉండవు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ తాజా క్రెడిట్ కార్డ్‌పై వివరాలన్నీ ఉండటంతో పాటు పారదర్శకంగా కూడా ఉంటుంది. -
ఎన్ఆర్ఐలకు ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పథకం
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) ఆర్థికేతర అవసరాలను నెరవేర్చే నిమిత్తం ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ‘ఎన్ఆర్ఐ అడ్వాంటేజ్’ పేరుతో ప్రారంభించిన ఈ పథకం వారి ఆరోగ్య సంబంధమైన అలాగే కుటుంబ, స్నేహితుల గిఫ్టింగ్, ఇతర ఇండియన్ బేస్డ్ షాపింగ్ అవసరాలు తీర్చడానికి, ఆయా అంశాల్లో డిస్కౌంట్లకు దోహదపడుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు 150 దేశాల్లోని 15 లక్షల మంది ఎన్ఆర్ఐలకు కొత్త ప్రొడక్ట్ ద్వారా సేవలు అందించగలుగుతామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ తెలి పారు. ఎన్ఆర్ఐ ప్రైమా, ఎన్ఆర్ఐ ప్రొ, ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందించాలన్న లక్ష్యంతో కొత్త ప్రొడక్ట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. తద్వారా షాపింగ్‌కు సంబంధించి ఎన్ఆర్ఐలు మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారని అన్నారు. -
డెబిట్ కార్డ్‌తోనూ ఈఎంఐ స్కీమ్
ముంబై: డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై సమాన నెలవాయిదా (ఈఎంఐ) స్కీమ్‌ను ప్రైవైట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభించింది. ఈ తరహా స్కీమ్ దేశంలో ఇదే మొదటిదని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ చెప్పారు.్ర కెడిట్ కార్డ్‌ల ద్వారా వస్తువులను ఈఎంఐల ద్వారా కొనుగోలు చేయవచ్చని, కానీ డెబిట్ కార్డ్ ద్వారా వస్తువుల కొనుగోళ్లకు ఈఎంఐ స్కీమ్‌ను తొలిసారిగా అందిస్తున్నామని వివరించారు. అయితే సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కనీసం రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారే ఈ స్కీమ్‌కు అర్హులని తెలిపారు. మొదటగా ఈ స్కీమ్‌ను శామ్సంగ్ బ్రాండ్ ఉత్పత్తులకు ఆఫర్ చేస్తున్నామని, ఆ తర్వాత ఇతర బ్రాండ్లకు విస్తరిస్తామని వివరించారు. ఈఎంఐలను మూడు/ఆరు/తొమ్మిద/ పన్నెండుగా ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈఎంఐ స్కీమ్‌కు సంబంధించి డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై 13 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని వివరించారు. ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ స్కీమ్ కారణంగా 2.2 కోట్ల మంది ఐసీఐసీఐ డెబిట్ కార్దుదారులు పండుగల సీజన్ సందర్భంగా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పొందవచ్చని, కొనుగోళ్ల లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చని తెలిపారు.


