ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ

Chinu Kala founder Rubans Accessories success story who left home at 15 - Sakshi

చినుకులా మొదలై..సునామీలా చుట్టేస్తున్న ‘చిను కలా’  స్టోరీ వింటే..ఎక్కు తొలి మెట్టు.. కొండని కొట్టు ఢీకొట్టు. గట్టిగా పట్టే నువు పట్టు...గమ్యం చేరేట్టు అన్న సినీ కవి మాటలు గుర్తు రాకమానవు. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే. ఆ కష్టాలు, కడగండ్లే  సరికొత్త భవిష్యత్తుకు పునాది. పొట్టతిప్పల కోసం  అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్‌తో ఒక లగ్జరీ బ్రాండ్‌తో ఉన్నత శిఖరాలకు  చేరి  చిను కలా తన కలలను పండించుకున్న తీరు  స్ఫూర్తి దాయకం.

ప్రసిద్ధ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్  రూబన్స్ యాక్సెసరీస్ డైరెక్టర్ చిను కలా సక్సెస్‌ స్టోరీ: 
1981 అక్టోబర్‌ 10న రాజస్తాన్‌లో పుట్టిన చిను స్కూల్‌లో చదువుకుంటున్నపుడే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోంచి పారిపోయింది. ముంబైలోని సెయింట్ అలోసియస్  10వ తరగతి చదువుతున్నపుడే.. దాదాపు 15 ఏళ్లకే పొట్టకూటికోసం రోడ్డుమీద పడింది.  ఇంటి గడపదాటే నాటికి ఆమె వద్ద కేవలం రూ. 300, ఒక బట్టల బ్యాగ్ మాత్రమే ఉన్నాయి. (నిజానికి 13 ఏళ్ల వయస్సప్పుడే  తండ్రి ఇంట్లోంచి పొమ్మంటూ అవమానించాడట) ఏం చేయాలో అర్థం కాక ముంబైలోని రైల్వే స్టేషన్‌లో రెండు రోజులు పడుకుంది. ఒక మూల కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ కంటికి ధారలా ఏడ్చింది.  డోర్‌-టు-డోర్ సేల్ గురించి ఒక మహిళ ద్వారా తెలుసుకుని చివరికి సేల్స్‌గర్ల్‌ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్‌లను అమ్మడం స్టార్ట్‌చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. (ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్‌: వీడియో వైరల్‌)

ముంబై లాంటి మహానగరంలో ఒంటరిగా, అదీ సేల్స్‌ గర్ల్‌గా ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్టు తిరుగుతూ అనేక అవమానాలను  ఎదుర్కొంది. అందరూ ఈమె ముఖం మీదే తలుపులు వేసేవారు. వంద ఇళ్లు తిరిగితే ఒకటో రెంటో అమ్మ గలిగేది. దీనికి తోడు అక్కడ పనిచేసేవాళ్లందరికీ ఒకటే హాలు, వంటగదీ లేదు. వాష్‌ రూం అంతకన్నా లేదు. దుర్భర జీవితం. అయినా ఓడిపోలేదు. ఆరు-ఏడు నెలల తర్వాత లీడర్‌గా మారింది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకే కదిలింది. అలుపెరుగని జీవన పోరాటంలో పట్టు వదలక ఒక్కో మెట్టు ఎక్కుతూ రూ.40 కోట్ల టర్నోవర్ కంపెనీ రూబన్స్ యాక్సెసరీస్ యజమానిగా అవతరించింది. అంతేనా స్నేహితుల ప్రోత్సాహంతో 2007లో, గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా అందాల పోటీలకు  ఎంపికైంది. అలా ఫ్యాషన్ ,ఆభరణాల ప్రపంచానికి పరిచయం అయింది.  మోడల్‌గా రాణించింది.

ఈ ప్రయాణంలో వెయిట్రెస్‌గా పనిచేయడంతోపాటు ఎన్నో రకాల పనులు చేసింది. అలా ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్‌లో టెలీమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం రావడం ఆమె జీవితంలో ఒక  పెద్ద బ్రేక్ , అక్కడే ఎంబీఏ గ్రాడ్యుయేట్ అమిత్ కలాతో పరిచయం ప్రేమగా కారింది. 2004లో అమిత్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టింది.

చిను కలలకు రెక్కలిచ్చిన భర్త
భర్తగా,వ్యాపారవేత్తగా అమిత్‌ చినుకి కొండంతగా అండగా నిలిచాడు. నైపుణ్యాలను మెరుగుపరిచాడు. వ్యాపారవేత్త కావాలన్న ఆమె కలలకు రెక్కలిచ్చాడు. ఫలితంగా 2008లో కార్పోరేట్ మర్చండైజింగ్‌లో నైపుణ్య కంపెనీ ఫాంటే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎదురైన ప్రతి సవాల్‌ను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చిన చిను కలా 2014లో బెంగళూరు మాల్‌లోని చిన్న కియోస్క్ నుండి రూబన్స్ యాక్సెసరీస్‌ను ప్రారంభించింది.  2021 నాటికి తన బ్రాండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లి పలువురి ప్రశంసలు అందుకుంది. తనలాంటి చాలామంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇపుటు కోట్ల టర్నోవర్‌తో సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ విమెన్‌గా రాణిస్తోంది. భర్త, కుమార్తతో కలిసి బెంగళూరు, ఫీనిక్స్ మాల్ సమీపంలోని 5వేల చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న చిను గరాజ్‌లో ఖరీదైన బీఎండబ్ల్యూ-5 కారు కొలువు దీరడంలో ఆశ్చర్యం ఏముంది?

పోటీని ఎదుర్కోవాలంటే..రెండడుగులు ముందుండాలి!
పోటీని ఓడించాలంటే.. ప్రత్యర్థులకంటే రెండు అడుగులు ముందుండటమే ఏకైక మార్గం అంటారు చిను.  అందమైన డిజైన్లుతో ఏడాదికి కనీసం 10-12 కలెక్షన్‌లను తీసుకొస్తూ రూబన్స్ యాక్సెసరీస్  పాపులర్‌ అయిందని, మార్కెట్‌లో భారతీయ ,పాశ్చాత్య డిజైన్‌లను కలిగి ఉన్న ఏకైక బ్రాండ్  మాదే అంటారామె. ఇటీవీల షార్క్ ట్యాంక్ ఇండియా 2 తాజా ఎపిసోడ్‌లో, చిను కలా , అమిత్ కలా తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, ప్రయాణం, డిజైనర్ జ్యువెలరీ బ్రాండ్-రూబన్స్‌ గురించిన విశేషాలు పంచు కోవడం అందిరినీ ఆకర్షించింది. రోజుకు 15 గంటలుకు మించి పనిచేస్తానంటూ చిను. దేశీయ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెట్ వాటాలో(రూ. 21000 కోట్లు అంచనా)  భవిష్యత్తులో 25 శాతం వాటాను సాధించాలనేదే చిను లక్క్ష్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top