ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!

Chinese Supersonic Aircraft Will Fly From Beijing to New York in One Hour - Sakshi

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అనేక దేశాలు చాలా రోజుల నుంచి పోటీ పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ జాబితాలో ముందు వరుసలో చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. అయితే, ఈ దేశాల కంటే ముందే చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్.. బిజినెస్ కోసం ఒక సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. చైనా ఏరోస్పేస్ సంస్థ అభివృద్ది చేస్తున్న సూపర్ సోనిక్ జెట్ విమానం గంటలో చైనా రాజధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ నగరాన్ని చేరుకొనున్నట్లు తెలిపింది. ఇది గంటకు 2,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది.

ఈ జెట్ వాణిజ్య విమానాల కంటే ఆరు రెట్లు వేగం వెళ్లనున్నట్లు వివరించింది. స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ గత ఏడాది తన సూపర్ సోనిక్ జెట్ విమానం కోసం 46.3 మిలియన్ డాలర్లను ఫండ్ కూడా సేకరించినట్లు తెలిపింది. టియాన్‌క్సింగ్ 1, టియాన్‌క్సింగ్ 2 అని పిలిచే ఈ విమానాలను విజయవంతంగా పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ 2024లో తన మొదటి ఫ్లైట్ టెస్ట్ నిర్వహించడానికి ముందు 2023 చివరి నాటికి గ్రౌండ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. 

ఇదే మొదటి కాదు
ఇదే మొదటి సూపర్ సోనిక్ విమానం మాత్రం కాదు. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ దేశానికి చెందిన విమాన తయారీ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మించిన మొదటి కాంకార్డ్ సూపర్ సోనిక్ వాణిజ్య విమానాన్ని 1973 సెప్టెంబరు 26న  అందుబాటులోకి తీసుకొని వచ్చాయి. 1976 జనవరి 21న ప్రపంచంలోని మొట్టమొదటి షెడ్యూల్డ్ సూపర్ సోనిక్ విమానం ప్యాసింజర్ సేవలను కూడా ప్రారంభించింది. ఈ జెట్లను బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎయిర్ ఫ్రాన్స్ విస్తృతంగా ఉపయోగించాయి. అయితే, విమానం శబ్దం ఎక్కువగా రావడం, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువ కావడంతో వాటి సేవలను నిలిపి వేయాల్సి వచ్చింది. చివరకు మే 2003లో ఎయిర్ ఫ్రాన్స్, అక్టోబర్ 2003లో బ్రిటిష్ ఎయిర్ వేస్ కాంకార్డ్ సేవలను నిలిపి వేశాయి.

(చదవండి: లాంఛ్‌కు ముందే బుకింగ్‌కు టయోటా బ్రేకులు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top