ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్‌జీపీటీ!

Chatgpt Helps To Recover 109500 Usd From Client Who Ghosted - Sakshi

కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) రంగంలో చాట్‌జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. లాంచ్‌ అయినప్పటి నుంచి రోజుకో విభిన్నమైన పని చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాను ఏమేమి చేయగలనో ఒక్కోటిగా చేసి చూపిస్తోంది. దాంతో ఒక్కొక్కరు ఒక్కో పని చేయించుకుంటున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఓ వ్యక్తి తనకు రావాల్సిన మొండి బాకీని వసూలు చేసుకునేందుకు చాట్‌జీపీటీ సహాయం తీసుకున్నాడు. ఇక రాదు డబ్బును ఒక్క మెయిల్‌తో తిరిగి వచ్చేలా చేసి ఔరా అనిపించింది చాట్‌జీపీటీ. 

క్లయింట్‌ నుంచి తమకు రావాల్సిన 1,09,500 డాలర్లు (రూ.90,80,331) రాబట్టుకోవడంలో చాట్‌జీపీటీ తనకు ఏవిధంగా సహాయపడిందీ గ్రెగ్‌ ఐసెన్‌బర్గ్‌ అనే వ్యక్తి ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘ఓ మల్టీ బిలియన్‌ డాలర్ల క్లయింట్‌ కోసం మీరు చేసిన పనికి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడితే మీరు ఏం చేస్తారు. చాలా మంది మంచి లాయర్‌ పెట్టుకుంటారు. కానీ నేనే చాట్‌జీపీటీ సహాయం తీసకున్నా. ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా మా క్లయింట్‌ నుంచి రావాల్సిన 1,09,500 డాలర్లు వసూలు చేసుకునేందుకు చాట్‌జీపీటీ సాయం చేసింది’ అని పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: కుక్కల కోసం ప్రత్యేక రెస్టారెంట్‌.. ఎక్కడో తెలుసా?)

గ్రెగ్‌ ఐసెన్‌బర్గ్‌కు ఒక డిజైన్‌ కంపెనీ ఉంది. దాని ద్వారా ఓ ప్రముఖ బ్రాండ్‌కు డిజైన్‌ వర్క్‌ చేసిచ్చారు. ఆ డిజైన్‌ వారికి బాగా నచ్చింది. అయితే దానికి వారి నుంచి డబ్బు రాలేదు. ఎన్ని మెయిల్స్‌ పంపినా స్పందన లేదు. ‘ఇక చేసేది ఏం లేక మా ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ టీం నన్ను రంగంలోకి దిగాలని కోరారు. ఇంకెన్ని మెయిల్స్‌ పంపినా ప్రయోజనం లేదనిపించింది. డబ్బు వసూలు కోసం ఖరీదైన లాయర్‌ను పెట్టుకోవడం కన్నా చాట్‌ జీపీటీ సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. మా డబ్బు చెల్లించేలా ఆ క్లయింట్‌కు ఓ మెయిల్‌ రాసివ్వాలని చాట్‌జీపీటీని కోరగా అది చాలా చక్కగా రాసిచ్చింది. ఆ మెయిల్‌కు వెంటనే క్లయింట్‌ దగ్గర నుంచి స్పందన వచ్చింది. మీకు రావాల్సిన డబ్బును వెంటనే చెల్లిస్తామని వారు బదులిచ్చారు’ అని ఐసెన్‌బర్గ్‌ వివరించారు.

(ఇదీ చదవండి: అతిగా ఫోన్‌ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top