ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్‌!

Centre Cancels License Of 18 Pharma Companies Over Poor Quality Medicines - Sakshi

నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. నాణ్యత లేమి డ్రగ్స్‌ను తయారు చేసిన 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను రద్దుతో పాటు తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు అందించింది. 

భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు నకిలీ మందులు విదేశాలకు విక్రయిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఫార్మా కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 76 ఫార్మా కంపెనీల్లో సోదాలు నిర్వహించింది.  
 
ప్రపంచ దేశాల్లో భారత్‌లో తయారు చేసిన డ్రగ్స్‌ వినియోగించడం కారణంగా పలువురు మరణించడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత ఫిబ్రవరి నెలలో గుజరాత్‌కు చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ (Zydus Lifesciences) సంస్థ కీళ్ల నొప్పుల్ని నయం చేసే జనరిక్‌ మెడిసిన్‌ తయారు చేసి యూఎస్‌ మార్కెట్‌లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఆ ఔషదాలున్న 55 వేల బాటిళ్లను రీకాల్‌కు పిలుపునిచ్చింది.   

గత ఏడాది నోయిడాకి చెందిన మరియన్‌ బయోటెక్‌ ఫార్మా సంస్థ నకిలీ దగ్గు మందును తయారు చేసింది. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆరోపణలతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ అధికారులు మరియన్‌ బయోటెక్‌ ఫార్మాలో శాంపిల్స్‌ను టెస్ట్‌ చేశారు. ఆ టెస్ట్‌లలో 22 రకాల మరియన్‌ బయోటెక్‌ తయారు చేసిన డ్రగ్స్‌ నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. 

ఇలా ఫార్మా కంపెనీలపై వరుస ఫిర్యాదులు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారంతో ఫార్మా కంపెనీల్లో సోదాలు జరిపి చర్యలు తీసుకుంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top