సెప్టెంబర్‌ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు

Centre To Borrow 5.03 Lakh Crore Over Second Half Of 2021-22 - Sakshi

రానున్న ఆరు నెలల్లో 5.03 లక్షల కోట్ల ప్రణాళిక 

న్యూఢిల్లీ: కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. అక్టోబర్‌ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. ఆర్థిక శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  2021–22 బడ్జెట్‌ నిర్దేశాల ప్రకారం– కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12.05 లక్షల కోట్ల స్థూల మార్కెట్‌ రుణ సమీకరణ జరపాల్సి ఉంది. ఇందులో మొదటి ఆరు నెలల్లోనే రుణ లక్ష్యంలో 60 శాతం అంటే దాదాపు రూ.7.24 లక్షల కోట్ల సమీకరణ చేయాల్సి ఉంది. అయితే సమీకరణ లక్ష్యం కొంత తగ్గింది.

ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కొంత మేర భర్తీ చేయడానికి మార్కెట్‌ నుంచి కేంద్రం రుణ సమీకరణలు జరుపుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతంగా ఉంది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం(రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్‌ లక్ష్యం. అయితే 8శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్‌ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థికవేత్తలు కొందరు ఉద్ఘాటిస్తుండగా, కేవీ కామత్‌ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని కేంద్రం ప్రదర్శించవచ్చని సూచిస్తున్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top