టెలికం కంపెనీలకు కేంద్రం భారీ ఊరట! | Sakshi
Sakshi News home page

spectrum charge case: టెలికం కంపెనీలకు కేంద్రం ఊరట!

Published Wed, Oct 6 2021 8:18 AM

central govt withdraw Rs 40,000 crore spectrum charge case - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు రూ. 40,000 కోట్ల వసూళ్ల వివాదాలకు సంబంధించి టెలికం కంపెనీలపై దాఖలు చేసిన లీగల్‌ కేసులను ఉపసంహరించుకోవాలని టెలికం శాఖ (డాట్‌) యోచిస్తోంది. ఇందులో భాగంగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌పై కేసు విషయంలో ప్రస్తుత అప్పీలును కొనసాగించాలా లేదా అన్న దానిపై తగు నిర్ణయం తీసుకునేందుకు అవకాశమివ్వాలంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెల్కోలు సంక్షోభంలో కూరుకుపోతే బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) తమకు విజ్ఞప్తి పంపిందని అఫిడవిట్‌లో డాట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పీళ్లపై ముందుకెళ్లే విషయాన్ని పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని వివరించింది.  కేసు విచారణ సదర్భంగా ఇదే విషయాన్ని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవలసిందని సూచిస్తూ, కేసు విచారణను నవంబర్‌ 17కు ధర్మాసనం వాయిదా వేసింది. 

పరిస్థితి తీవ్రత దృష్ట్యా వివిధ స్థాయుల్లో అప్పీళ్లపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని అఫిడవిట్‌లో పేర్కొంది. సముచిత నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి మూడు వారాల వ్యవధినివ్వాలని, కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం వివిధ టెలికం ఆపరేటర్ల నుంచి ఈ కేసుల ద్వారా ఖజానాకు సుమారు రూ. 40,000 కోట్లు రావాల్సి ఉంది. 

టెలికం రంగాన్ని ఆదుకునే దిశగా బకాయిలు, పెనాల్టీలు చెల్లించడానికి సమయమిస్తూ సెప్టెంబర్‌ 15న కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో టెల్కోలపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించే యోచన చేయడమనేది గత సమస్యలను సరిచేసే ప్రయత్నంలో భాగంగా చూడవచ్చని న్యాయసేవల సంస్థ సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ పార్ట్‌నర్‌ సమీర్‌ చుగ్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement