ఎయిర్‌ ఏషియా ఇకపై ఉండదు! కారణమిదే?

CCI Approves Proposed Acquisition Of AirAsia India By Air India - Sakshi

ఎయిరిండియా చేతికి ఎయిర్‌ఏషియా ఇండియా

కొనుగోలు ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం   

న్యూఢిల్లీ: ఎయిర్‌ఏషియా ఇండియాలో మొత్తం ఈక్విటీ వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్‌ చేసింది. పరిశ్రమలో గుత్తాధిపత్యానికి దారితీసే అవకాశం ఉండే డీల్స్‌కు సీసీఐ ఆమోదం అవసరమవుతుంది. వివరాల్లోకి వెడితే .. టాటా సన్స్‌ (టీఎస్‌పీఎల్‌), ఎయిర్‌ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏఏఐఎల్‌) కలిసి జాయింట్‌ వెంచర్‌ సంస్థగా ఎయిర్‌ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి.

ఇందులో టీఎస్‌పీఎల్‌కు 83.67 శాతం, ఏఏఐఎల్‌కు 16.33 శాతం వాటాలు ఉన్నాయి. 2014 జూన్‌లో ఎయిర్‌ఏషియా ఇండియా దేశీయంగా ప్రయాణికులకు ఫ్లయిట్‌ సర్వీసులు, సరుకు రవాణా, చార్టర్‌ ఫ్లయిట్‌ సేవలను ప్రారంభించింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు లేవు. మరోవైపు, టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఈ ఏడాదే ప్రభుత్వ రంగ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్‌ ఇప్పటికే జాయింట్‌ వెంచర్లయిన ఎయిర్‌ఏషియా ఇండియా, విస్తార ద్వారా సేవలందిస్తోంది. తాజాగా ఎయిరిండియా కొనుగోలు తర్వాత ఏవియేషన్‌ కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top