అసలు చెల్లిస్తే వడ్డీ వదులుకుంటాం 

Cairn Energy Says Ready To Forgo USD 500 mn India Pays Principal Due - Sakshi

కెయిర్న్‌ ఎనర్జీ తాజా ప్రతిపాదన 

న్యూఢిల్లీ: యూకే కంపెనీ కెయిర్న్‌ ఎనర్జీ తాజాగా అసలు చెల్లిస్తే వడ్డీని వదులుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిలో భాగంగా 50 కోట్ల డాలర్ల వడ్డీని ప్రభుత్వం సూచించిన చమురు, గ్యాస్‌ లేదా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అవార్డుకు ప్రభుత్వం ఒప్పుకుని పునఃసమీక్ష ద్వారా పన్ను విధింపుతో తమకు కలిగిన నష్టాన్ని చెల్లించేటట్లయితే వడ్డీని వదులుకోగలమని కెయిర్న్‌ ఎనర్జీ వివరించినట్లు తెలుస్తోంది. 1994లో చమురు, గ్యాస్‌ రంగంలో ఈ స్కాట్లాండ్‌ కంపెనీ ఇన్వెస్ట్‌ చేసింది. తద్వారా రాజస్తాన్‌లో భారీ చమురు నిక్షేపాన్ని వెలికి తీసింది.

2006–07లో బీఎస్‌ఈలో దేశీ ఆస్తులతో కూడిన కంపెనీని లిస్ట్‌ చేసింది. ఐదేళ్ల తదుపరి కంపెనీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెట్రోయాక్టివ్‌ పన్ను చట్టం ప్రకారం వడ్డీతో సహా రూ. 10,247 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా దేశీ సంస్థలో మిగిలిన కెయిర్న్‌ షేర్లను లిక్విడేట్‌ చేయడం, పన్ను రిఫండ్లను నిలువరించడం తదితరాలను చేపట్టింది. అయితే కెయిర్న్‌ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ హేగ్‌లోని ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. కాగా.. 2020 డిసెంబర్‌లో ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ వడ్డీతో కలిపి అసలు 1.2 బిలియన్‌ డాలర్లు కెయిర్న్‌ ఎనర్జీకి తిరిగి చెల్లించవలసిందిగా తీర్పులో పేర్కొంది. 

చదవండి: రెమిడెసివర్‌ ఎగుమతులపై కేంద్రం నిషేధం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top