వ్యాపార విశ్వాస సూచీ రయ్‌!

Business Confidence Index Showing That Indian Economy Is Recovering - Sakshi

జూలై–సెప్టెంబర్‌ మధ్య ఎన్‌సీఏఈఆర్‌ ఇండెక్స్‌  90 శాతం అప్‌

ఎకానమీ రికవరీకి సంకేతం   

న్యూఢిల్లీ: ఎకానమీ వేగవంతమైన రికవరీకి సంకేతంగా తన వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌తో పోల్చి) 90 శాతం పెరిగినట్లు ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎన్‌సీఏఈఆర్‌ పేర్కొంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తా ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే... 

- కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ తర్వాత రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌ వ్యాపార సెంటిమెంట్‌ మెరుగుపడింది. అంతకుముందు మూడు నెలలతో పోల్చితే పలు విభాగాలు పురోగతి బాట పట్టాయి. బీసీఐ త్రైమాసికంగా చూస్తే, 90 శాతం పెరిగితే, వార్షికంగా 80 శాతం పురోగతి సాధించింది.  
- సెప్టెంబర్‌ 2021లో చేపట్టిన వ్యాపార అంచనా సర్వే (బీఈఎస్‌) 118వ రౌండ్‌ అంశాల ఆధారంగా తాజా గణాంకాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లోని 500 సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే, 1991 నుంచి త్రైమాసికం ప్రాతిపదికన ఎన్‌సీఏఈఆర్‌ ఈ సర్వే నిర్వహిస్తోంది.  
- వెస్ట్‌ జోన్‌ మినహా, అన్ని ప్రాంతాల్లో వ్యాపార సెంటిమెంట్‌ మెరుగుపడింది. 2021–22 రెండవ త్రైమాసికంలో పశ్చిమ ప్రాంతంలో బీసీఐ దాదాపు 10 శాతం తగ్గింది.  అయితే తూర్పు (కోల్‌కతా), ఉత్తర (ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం), దక్షిణ (చెన్నై, బెంగళూరు) ప్రాంతాల్లో వృద్ధి తీరు బాగుంది.  
- ప్రధానంగా నాలుగు భాగాలకు సంబంధించిన సెంటిమెంట్‌లు మెరుగుపడ్డాయి. ఈ నాలుగు అంశాలనూ పరిశీలిస్తే,   ‘మొత్తం ఆర్థిక పరిస్థితులు రాబోయే ఆరు నెలల్లో మెరుగుపడతాయి... రాబోయే ఆరు నెలల్లో సంస్థల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది... ఆరు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుత పెట్టుబడి వాతావరణం సానుకూలంగా ఉంది...  ప్రస్తుత సామర్థ్య వినియోగం సరైన స్థాయికి దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంది’.  
- 2019–20 రెండవ త్రైమాసికం– 2020–21 మూడవ త్రైమాసికం మధ్య విస్తరించిన పెద్ద సంస్థలు,  చిన్న సంస్థల వ్యాపార సెంటిమెంట్‌ల మధ్య వ్యత్యాసం తాజాగా తగ్గింది. ముఖ్యంగా 2021–22 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ వ్యత్యాసం భారీగా తగ్గడం గమనార్హం. ప్రస్తుతం ఒడిదుడుకులుగా ఉన్న రికవరీ, రానున్న త్రైమాసికాల్లో కుదుటపడుతుందన్న ఆశావాదాన్ని ఇది కల్పిస్తోంది.  
 - ఉత్పత్తి, దేశీయ విక్రయాలు, ఎగుమతులు, కొత్త ఆర్డర్లు, ముడిసరుకు దిగుమతులు, పన్నుకు ముందు లాభాలపై సెంటిమెంట్లు వంటి పలు అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో  మెరుగయ్యాయి.  
- ఇక 2021–22 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి యూనిట్‌కు ముడి పదార్థాల ఖర్చులు 54 శాతం పెరిగాయి. రానున్న త్రైమాసికాల్లో ఈ వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.  మూడింట సర్వేలో పాల్గొన్న రెండు వంతుల సంస్థలు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వ్యయాలకు సంబంధించి సెంటిమెంట్‌లు, ముఖ్యంగా ముడి పదార్థాలకు సంబంధించి ప్రతికూలంగా ఉన్నాయి.  
పొలిటికల్‌ ఇండెక్స్‌ కూడా... 
కాగా, ఎన్‌సీఏఈఆర్‌ పొలిటికల్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ (పీసీఐ) కూడా 2021–22 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంతో పోల్చితే  2021–22 జూలై–సెప్టెంబర్‌ కాలంలో దాదాపు 110 శాతం పెరిగింది.  గత ఆర్థిక సంవత్సరం  ఇదే త్రైమాసికంతో పోలిస్తే కూడా ఇండెక్స్‌ పురోగమనం 60 శాతం కంటే ఎక్కువగా ఉంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top