1,117 బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్‌.. కారణం ఇదేనా.. | BSNL Advance 4g Communication On Border Posts | Sakshi
Sakshi News home page

1,117 బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్‌.. కారణం ఇదేనా..

Jan 1 2024 1:39 PM | Updated on Jan 1 2024 2:11 PM

BSNL Advance 4g Communication On Border Posts  - Sakshi

దేశసరిహద్దుల్లో సేవలందిస్తున్న జవానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్‌వర్క్‌ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2020లో చైనాతో జరిగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో అక్కడి బలగాలతో మరింత కనెక్టివిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ పోస్టులు కూడా ఉండనున్నాయి. అయితే ఇందుకు దాదాపు రూ.1,545 కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. 

కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్‌ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభమయ్యాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్‌ పని కూడా పూర్తి చేశారు. 2023లో చైనా సరిహద్దుల్లో కొత్తగా 48.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. దీంతోపాటు నాలుగు ఔట్‌ పోస్టులు, మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. చైనాతో భారత్‌కు దాదాపు 3,488 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది.

ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే..

భారత్‌-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో కారణంగా ఇరుదేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంటోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది. అందులో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement