దాయాది పాకిస్థాన్ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. నిన్న రాత్రి ( మంగళవారం) నార్త్ కశ్మీర్ ప్రాంతంలోని కేరన్ సెక్టార్ ప్రాంతంలో భద్రతా బలగాలు పహారా చేస్తున్న సమయంలో కాల్పులు జరిపింది. అయితే భద్రతా బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని అధికారులు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ నిఘావ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. పాకిస్థాన్‌తో సరిహాద్దు పంచుకుంటున్న సమస్యాత్మక ప్రాంతాలలో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు ఆధునాతన సీసీ సర్వెలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా ఆసమయంలో పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది.
కెమెరాలు ఏర్పాటును అడ్డుకునేలా రెండు రౌడ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈకాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ప్రమాదంలో రెండువైపులా ఎవరికీ గాయాలుకానట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో చిల్లైకలానే అత్యంత కఠినమైన చలి ఉండే సమయం నడుస్తోంది.
ఈ సమయంలో పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉంది. అందుకే సరిహద్దు వెంబడి భద్రతను మరింత కఠినతరం చేశారు. ఎటువంటి చిన్నబొరబాట్లు సైతం దేశంలోకి జరగకుండా ప్రత్యేక నిఘావ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.


