టెక్‌ కంపెనీల్లో కోతల పర్వం..

Biggest job cuts announced by technology companies in the past 6 Months - Sakshi

నెల వ్యవధిలో 50 వేల పైచిలుకు ఉద్యోగాలు కట్‌

న్యూయార్క్‌: ఉత్పత్తులు, సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌ మొదలైన వాటికి డిమాండ్‌ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా చిన్నా, పెద్ద టెక్నాలజీ కంపెనీలు జోరుగా నియామకాలు జరిపాయి. కానీ, ఇటీవల పరిస్థితులు మారడంతో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే టెక్నాలజీ కంపెనీలు దాదాపు 50,000 మందికి ఉద్వాసన పలికాయి. అయితే, ఇటీవల కొన్ని వారాలుగా భారీగా తొలగింపులు చేపట్టినప్పటికీ మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ చాలా మటుకు టెక్‌ సంస్థల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగానే పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఈ మధ్య కాలంలో టెక్‌ రంగంలో ఉద్యోగాల కోతలను ఒకసారి చూస్తే..

2022 ఆగస్టు
స్నాప్‌:   సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం స్నాప్‌చాట్‌ మాతృ సంస్థ 20 శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.  
రాబిన్‌హుడ్‌: కొత్త తరం ఇన్వెస్టర్లకు మార్కెట్‌ను చేరువలోకి తెచ్చిన రాబిన్‌హుడ్‌ తమ ఉద్యోగుల సంఖ్యను 23 శాతం తగ్గించుకుంది. దాదాపు 780 మందిని తొలగించింది.

2022 నవంబర్‌
ట్విటర్‌: టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ చేతికి వచ్చే నాటికి ట్విటర్‌లో 7,500 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో దాదాపు సగం మందిని తొలగించారు.
లిఫ్ట్‌: ట్యాక్సీ సేవల సంస్థ లిఫ్ట్‌ దాదాపు 700 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం.
మెటా: ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా 11,000 మందికి ఉద్వాసన పలికింది.  

2023 జనవరి
అమెజాన్‌:  ఈ–కామర్స్‌ కంపెనీ 18,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న సిబ్బందిలో ఇది సుమారు 1 శాతం.
సేల్స్‌ఫోర్స్‌: కంపెనీ సుమారు 8,000 మందిని (మొత్తం సిబ్బందిలో 10 శాతం) తొలగించింది.  
కాయిన్‌బేస్‌: ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం 950 ఉద్యోగాల్లో కోత పెట్టింది. దాదాపు 20 శాతం మందిని తొలగించింది.
మైక్రోసాఫ్ట్‌: ఈ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని (సుమారు 10,000 ఉద్యోగాలు) తొలగిస్తోంది.
గూగుల్‌: ఈ సెర్చి ఇంజిన్‌ దిగ్గజం 12,000 మందికి ఉద్వాసన పలుకుతోంది. మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 6 శాతం.
స్పాటిఫై: ఈ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సేవల సంస్థ అంతర్జాతీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను 6 శాతం తగ్గించుకుంటోంది. నిర్దిష్టంగా సంఖ్యను పేర్కొనలేదు. ఇటీవలి స్పాటిఫై వార్షిక ఫలితాల నివేదిక ప్రకారం కంపెనీలో సుమారు 6,600 మంది ఉద్యోగులు ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top