దుమ్మురేపిన బజాజ్‌ ఫైనాన్స్‌ 

Bajaj finance touches rs 3 trillion mark - Sakshi

రెండేళ్లలో 25 శాతం వృద్ధి అంచనాలు

బ్యాంకింగ్‌ లైసెన్స్‌ బాటలో కంపెనీ

సరికొత్త గరిష్టాన్ని తాకిన షేరు

రూ. 3 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ 

ముంబై, సాక్షి: పతన మార్కెట్లోనూ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్‌ షేరు కదం తొక్కుతోంది. వెరసి తొలిసారి కంపెనీ విలువ రూ. 3 ట్రిలియన్‌ మార్క్‌ను అధిగమించింది. ఎన్‌ఎస్ఈలో షేరు ప్రస్తుతం 2.5 శాతం ఎగసి రూ. 5,018 సమీపంలో ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 3.02 లక్షల కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా రానున్న రెండేళ్లలో బిజినెస్‌ 25 శాతం చొప్పున వృద్ధి సాధించగలదంటూ కంపెనీ వేసిన అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్‌ విలువరీత్యా తాజాగా బజాజ్‌ ఫైనాన్స్‌ 9వ ర్యాంకుకు చేరడం గమనార్హం!

ర్యాలీ బాటలో 
గత మూడు నెలల్లో మార్కెట్లు 18 శాతమే పుంజుకున్నప్పటికీ.. బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు మాత్రం 42 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్‌-19 ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడుతుండటం, ఆర్థిక రికవరీ సంకేతాలు వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్‌-19 నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో బజాజ్ ఫైనాన్స్‌ పటిష్ట పనితీరును చూపడం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల ఆస్తులను కలిగి పదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకింగ్‌ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెరసి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ రేసులో బజాజ్‌ ఫైనాన్స్‌ ముందుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరుపట్ల రీసెర్చ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా స్పందించింది. రూ. 5,900 టార్గెట్‌ ధరతో ఈ షేరుని కొనుగోలు చేయవచ్చంటూ సిఫారసు చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top